
మండపేట: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం స్వేచ్ఛగా లభించేలా చర్యలు తీసుకుంటుందని జన నివాసాల మధ్య మద్యం షాపులు వద్దు అంటూ ఆరోపిస్తూ మండపేట మునిసిపల్ 28, 29, 30 వార్డుల ప్రజలు రోడ్డెక్కారు. జన నివాసాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు “మీ నాణ్యమైన మద్యం వద్దు!”, “మీ పిండ కూడు ప్రభుత్వం మాకు అవసరం లేదు!” అంటూ నినాదాలు చేశారు. మద్యానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, ప్రజలు దుకాణాన్ని వెంటనే తొలగించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పౌరుల ఆందోళన – ప్రభుత్వ వైఖరిపై అసహనం
స్థానికులు మాట్లాడుతూ “పాఠశాలలు, కాలనీల మధ్య మద్యం షాపు పెట్టడం ప్రజలకు తలనొప్పిగా మారింది”, “ఇది యువత భవిష్యత్తును నాశనం చేసే చర్య” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, మద్యం ఆదాయంపై మాత్రమే దృష్టి పెట్టిందని ఆరోపించారు.
ప్రభుత్వానికి ప్రజల హెచ్చరిక
ఇలా ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుంటే, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని మండిపడ్డారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోతే, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
Also read:
https://deccan24x7.in/telugu/ys-jagan-delimitation-letter-pm-modi-south-india-mp-seats/