
cm jagan
- ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో సీఎం జగన్
న్యూడెవలప్‌మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణసహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.
ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. ఈ చెరువులన్నింటినీకూడా గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలన్నారు సీఎం. దీనివల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందని చెప్పారు. చెరువు కింద చక్కగా భూములు సాగు జరుగుతుందని, వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఇందుకోసం సమగ్రమైన అధ్యయనం చేసి, ఈప్రాజెక్టును చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ప్రపంచబ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో దీన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు.
పనులు పూర్తిచేయకుండా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లు … వీటిని పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నామన్నారు. వీటి చుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయి కాబట్టి, వాటి పరిధిలో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం చాలా అవసరం అన్నారు.
సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ పి రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.