
రౌడీ హీరో విజయ్ దేవరకొండ- డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ట్రెండింగ్లో నిలుస్తోంది. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా క్లైమాక్స్ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
పూరి- విజయ్ ఇద్దరికీ ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా హిట్ అయితే.. విజయ్- పూరి ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. సినిమాను ఎలాగైనా హిట్ చేసేందుకు మేకర్స్ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. పుష్ప సినిమాలో క్లైమాక్స్ బాగా నచ్చిందని.. హీరో, విలన్ మాట్లాడుకోవడం కొత్తగా ఉందన్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు పూరీ. ఇలాంటి క్లైమాక్స్ ను ఏ సినిమాలో చూసి ఉండరు అంటూ పూరీ వివరించారు.
పాన్ ఇండియా మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆగస్టులో టాలీవుడ్ కి మంచి హిట్లు పడ్డాయి. ‘లైగర్’ కూడా హిట్టయిపోతే… ఈ యేడాది ఆగస్టుని ఎవ్వరూ మర్చిపోలేరు. నార్త్ లో ఇప్పటికే `లైగర్` మంచి బజ్ సంపాదించుకొంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, తొలి మూడు రోజులూ వసూళ్ల దుమ్ము దులిపేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.