
last rites of super star krishna performed with full state honours
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ ఫిలింనగర్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. అనంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం తనయుడు మహేష్ బాబు తండ్రి కృష్ణ చితికి నిప్పంటించారు. అశ్రు నయనాలతో కృష్ణ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.
పోటెత్తిన అభిమానులు :
అంతకుముందు, ఫిలింనగర్లోని పద్మాలయా స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచారు. కృష్ణకు నివాళులు అర్పించేందుకు జనం పోటెత్తారు. పద్మాలయా స్టూడియో దారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఒక దశలో అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. పలువురు అభిమానులు కృష్ణ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక బోరున విలపిస్తూ కనిపించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పద్మాలయా స్టూడియో నుంచి మహాప్రస్థానంకు అంతిమయాత్ర మొదలైంది. అంతిమయాత్ర దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా వందలాది మంది అభిమానులు ‘కృష్ణ అమర్ రహే’ అంటూ నినదించారు.
నివాళులు అర్పించిన సీఎం జగన్, బండి సంజయ్ :
పద్మాలయా స్టూడియోలో కృష్ణ పార్థివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. హీరో మహేష్ బాబును, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ట్యాంక్ బండ్పై కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై తెలంగాణ బీజేపీ తరుపున కేంద్రానికి సిఫారసు చేస్తామన్నారు.
అనారోగ్యంతో కన్నుమూసిన కృష్ణ :
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు స్వల్ప గుండెపోటు రావడంతో కోడలు నమత్ర కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే కృష్ణ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కృష్ణ మరణం సినీ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీ ఇండస్ట్రీలు కృష్ణ చేసినన్ని ప్రయోగాలు, సాహసాలు మరే హీరో చేయలేదని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.