
ఏపీలో జగన్ సర్కార్ పాలనకు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కూడా ఫిదా అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాఖాలోని టీడీపీ కార్యకర్తలను సైతం అధికార పార్టీ వైపు చూసేలా చూస్తున్నాయి. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన కుప్పంకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. జగన్ సుపరిపాలన తమను ఆకట్టుకుందని.. అందుకే వైసీపీలో చేరామని తెలిపారు.
కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లె మండలం కొడతనపల్లి గ్రామ పంచాయతీకి చెందిన 50 టీడీపీ కుటుంబాలు ఆదివారం (అక్టోబర్ 2) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై వారు ప్రశంసలు కురిపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే కుప్పం అభివృద్ధి బాట పట్టిందన్నారు. గతంలో ఎన్నడూ ఇన్ని సంక్షేమ పథకాలు తమకు అందలేదన్నారు. కుప్పం నియోజకవర్గానికి ఇన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు ఇక్కడ చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబుతో మరో 30 ఏళ్లకు కూడా కుప్పంలో అభివృద్ధి జరగదన్నారు.
గత 30 ఏళ్లుగా టీడీపీ జెండాలు మోసిన తాము వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ వెంటే నడుస్తామని చెప్పారు. ఇన్నేళ్లు టీడీపీ కార్యకర్తలుగా కొనసాగినందుకు పశ్చాత్తప పడుతున్నామని అన్నారు. టీడీపీ కార్యకర్తల చేరికలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కుప్పం గడ్డపై వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సీఎం జగన్ ఇటీవలి కుప్పం పర్యటన తర్వాత వైసీపీలో చేరేందుకు జనం భారీ ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. ఇప్పటికే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ భరత్ గెలుపుకు నియోజకవర్గ ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ… 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.
టార్గెట్ కుప్పం :
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేయాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలో ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాఖా అయిన కుప్పంపై గట్టి ఫోకస్ పెట్టింది. మూడు దశాబ్దాలుగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు కోటను బద్దలుకొట్టాలనే వ్యూహంతో పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కుప్పం బీసీల సీటు అని, కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాన్ లోకల్ అని వ్యూహాత్మక ఎత్తుగడను తెరపైకి తెచ్చింది. దీంతో కుప్పంలో గెలుపు చంద్రబాబుకు ఈసారి అంత సులువు కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.