
janasena party
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ పార్టీని రాష్ట్రమంతా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో జనసేనకు నాయకులు గట్టి షాక్ లు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా జనసేనకు పార్టీ కీలక నేత రాజీనామా చేయడం గమనార్హం.
జనసేన కుప్పం ఇన్చార్జి మద్దిరాల వెంకటరమణ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా వెంకటరమణ పోటీ చేసి ఓడిపోయారు. చాలా కాలంగా ఆయన పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
అయితే కొంతకాలంగా పార్టీ అధిష్టానం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం లేదు. తాను కుప్పం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చూస్తుంటే పీఏసీ కమిటీ తనను పట్టించుకోవడం లేదని రాజీనామా సందర్భంగా వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేనకు విధేయుడిగా ఉన్న వెంకటరమణ రాజీనామా చేయడం పార్టీకి నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి.