
kovvuru couple donates land worth rs 1 cr to government collector appreciates their move
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన పోణంగి బాల భాస్కరరావు-లక్ష్మీ సత్యవతి దంపతులు రూ.1 కోటి విలువ చేసే 700 గజాల భూమిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. కొవ్వూరు పట్టణంలోని ప్రధాన రహదారిని ఆనుకుని ఈ స్థలం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు లేదా ఇతర అవసరాల కోసం ఈ స్థలాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉచితంగా దాన్ని ప్రభుత్వానికి అప్పగించినట్లు బాల భాస్కరరావు దంపతులు తెలిపారు. ఈ మేరకు భూమికి సంబంధించిన పత్రాలను జిల్లా కలెక్టర్ కె మాధవీలతకు అందజేశారు.
రూ.1 కోటి విలువ చేసే స్థలాన్ని విరాళంగా ఇచ్చిన పోణంగి భాస్కరరావు-లక్ష్మీ సత్యవతి దంపతులను కలెక్టర్ మాధవీలత అభినందించారు. జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్తో కలిసి భాస్కరరావు దంపతులను పట్టు వస్త్రాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రజలపై కూడా సామాజిక బాధ్యత ఉంటుందని.. తమవంతు బాధ్యతగా సమాజం కోసం ఏదైనా చేయాలని అన్నారు. భూమిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చినందుకు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ జి. నర్సింహులు, కొవ్వూరు ఆర్డీవో మల్లి బాబు, రాజమహేంద్రవరం ఆర్డీవో చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.
పోణంగి భాస్కరరావు గతంలో కొవ్వూరు కరణంగా పనిచేశారు. 1938లో కొవ్వూరులో కొంతమంది కరణాలు నిర్మించిన భవనం, ఖాళీ స్థలం నిర్వహణ బాధ్యతలను నిన్నటివరకూ భాస్కరరావే చూసుకున్నారు. అప్పట్లో ఉద్యోగస్తులు రాత్రిపూట బస చేసేందుకు కరణాలు ఈ భవనాన్ని నిర్మించినట్లు చెబుతారు. దీన్ని నిర్మించిన కరణాల సంఘంలో మొత్తం 120 మంది ఉన్నారు. ఇందులో కొందరు చనిపోగా.. మరికొందరు పదోన్నతిపై ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. దీంతో ఈ భవనం, ఖాళీ స్థలం ఇన్నాళ్లు భాస్కరరావు ఆధీనంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని భాస్కరరావు దంపతులు భావించారు. జిల్లా అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. భవనాన్ని, స్థలాన్ని ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేయించి కలెక్టర్కు ఆ పత్రాలు అందజేశారు. పోణంగి దంపతుల విరాళం గురించి తెలిసి చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.