
brs
- మాజీలతో తాజా చర్చలు
కొత్తగా జాతీయ పార్టీగా మారిన భారత రాష్ట్ర సమితి.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న టీఆర్ఎస్ అధినేత, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలోనూ పాగా వేయాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా రాజకీయాలకు దూరంగా ఉన్న, మాజీలపై ప్రత్యేక ఫోకస్ చేసినట్టు చర్చ జరుగుతోంది. కలిసొచ్చే వారందరినీ కలుపుకొని సంక్రాంతి నాటికి ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలంతా వైసీపీలోకి చేరిపోవడంతో ఆ పార్టీ స్పేస్ లో బీఆర్ఎస్ చొరబడవచ్చని చెబుతున్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తెలంగాణ నేతలందరికీ ఏపీలో విస్తృత పరిచయాలున్నాయి. కనుక బీఆర్ఎస్ కు ఏపీలో కచ్చితంగా ఆదరణ లభిస్తుందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగా.. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ మంత్రులు, నేతలతో పరిచయాలు ఉన్న కొందరు నేతలు.. ఏపీలో కేసీఆర్ ప్లాన్ పై ఆరా తీస్తున్నారని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఏపీలో పార్టీని విస్తరించడంలో భాగంగా.. వచ్చే సంక్రాంతి నాటికి విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ సభకు ప్రణాళికలు రచించినట్టు సమాచారం. గతంలో రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉండి.. ప్రస్తుతం యాక్టివ్ గా లేని పలుకుబడి ఉన్న వారిని సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. టీఆర్ఎస్ నేతలతో గతంలో కలిసి పని చేసిన కొందరు కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నేతలతో కూడా మాట్లాడి కండువా కప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితి హోర్డింగులతో నింపేయగా.. ఏపీలోనూ అడపాదడపా బ్యానర్లు వెలిశాయి. విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి సమీపంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీ ప్రకటిస్తున్న జయహో కేసీఆర్ అంటూ హోర్డింగ్‌పై.. కీసీఆర్, కేటీఆర్ చిత్రాలను ముద్రించారు.
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ పార్టీ విధానం తమదని, ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని వివరించారు. కొత్త పార్టీల రాకపై విశ్లేషించబోమని, ఏపీ అభ్యున్నతే ముఖ్యమని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాల గురించి తాము మాట్లాడటం లేదని, వాళ్లు అక్కడి విషయాలు వదిలేసి తమ గురించి విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారేమో తమకు తెలియదన్నారు.