
cm ys jagan
ఆడబిడ్డ పెళ్లంటే నిరుపేద తల్లిదండ్రులకు అప్పుల కుంపటి. బిడ్డ పెళ్లి చేస్తున్నామనే సంతోషం కన్నా అప్పు ఎలా తీర్చాలనే బెంగ ఎక్కువగా ఉంటుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం జగన్ ఈ విషయంలో పేదింటి బిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలవనున్నారు. పేదింటి బిడ్డలకు మేనమామలా ప్రభుత్వం తరుపున కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం (సెప్టెంబర్ 30) మార్గదర్శకాలు జారీ చేసింది. నేటి (అక్టోబర్ 1) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.
ఆర్థిక సాయం..
కల్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.1 లక్ష చొప్పున, బీసీ వర్గాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.50 వేలు చొప్పున, షాదీ తోఫా పథకం కింద మైనారిటీ వర్గాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.1 లక్ష చొప్పున జగన్ సర్కార్ ఆర్థిక సాయం చేయనుంది. అలాగే, కులాంతర వివాహాలకు కూడా ప్రభుత్వం తగిన ప్రోత్సాహకం అందించనుంది. ఎస్సీ కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, బీసీ కులాంతర వివాహాలకు రూ.75 వేలు ప్రోత్సాహకంగా అందించనుంది. ఇక దివ్యాంగుల పెళ్లిళ్లకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు రూ.40 వేలు ఆర్థిక సాయం అందించనుంది.
ప్రతీ 3 నెలలకొసారి అర్హుల ఎంపిక
కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద ప్రతీ 3 నెలలకొసారి అర్హులను ఎంపిక చేసి నగదు సాయం అందజేస్తారు. ఆన్లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. ప్రతీ 3 నెలలకొకసారి అర్హులకు నగదు సాయం అందుతుంది.
నిబంధనలివే :
వధువు వయసు తప్పనిసరిగా 18 ఏళ్లు ఉండాలి. పదో తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణురాలై ఉండాలి. వరుడి వయసు 21 ఏళ్లు ఉండాలి. ఆడపిల్లకు ఒకవేళ రెండో పెళ్లి అయితే కల్యాణమస్తు, షాదీ తోఫా వర్తించదు. అయితే భర్త చనిపోయి రెండో పెళ్లి చేసుకునేవారికి మాత్రం మినహాయింపునిచ్చారు. గ్రామీణ ప్రాంతానికి చెందినవారైతే నెలసరి ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతానికి చెందినవారైతే నెలసరి ఆదాయం రూ.12 వేలు ఉండాలి. భూమి విషయానికొస్తే.. మూడెకరాల లోపు మాగాణి, పదెకరాల మెట్ట, రెండు కలిపి 10 ఎకరాలకు మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలకు, ప్రభుత్వ పెన్షనర్ల పిల్లలకు ఇది వర్తించదు. అయితే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మాత్రం మినహాయింపు ఉంది.
సొంత ఫోర్ వీలర్ ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్స్ ఉన్నవారికి మినహాయింపు ఉంది. నెలవారీ గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారి కుటుంబంలో ఏ ఒక్కరూ ఐటీ (ఇన్కమ్ ట్యాక్స్) చెల్లించేవారై ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా భవనం ఉండకూడదు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి
కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత ధ్రువ పత్రాలు సమర్పిస్తే డిజిటల్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తారు. వివాహం జరిగిన 60 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు తర్వాత వివిధ దశల్లో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేస్తారు.