
కలంకారీ అనగానే రంగురంగుల డిజైన్లతో మెత్తటి వస్త్రం కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ తర్వాత కలంకారీకి పేరొందిన బందర్, శ్రీకాళహస్తి గుర్తుకొస్తాయి. ఆధ్యాత్మికత పంచడంతోపాటూ కలంకారీ కళకు ఈ పట్టణాలు జీవం పోశాయి. సహజసిద్దంగా దొరికే చెట్ల బెరళ్లు, వేర్లు, కాయలతో తయారు చేసే రంగులను సంప్రదాయ కళాకృతులకు అద్దడం కలంకారీ ప్రత్యేకత. కేవలం ఆర్గానిక్ రంగులను ఉపయోగించి ఎన్నో చిత్రాలకు ప్రాణం పోస్తారు కలంకారీ కళాకారులు. మచిలీపట్నం, పెడన, శ్రీకాళహస్తిలో ఎన్నో కుటుంబాలు కలంకారీ కళపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కలంకారీ వస్త్రాలకు దేశీయంగానే కాక అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కలంకారీ వస్త్రాల తయారీలో మొదట కాటన్ వస్త్రాన్ని ఉతుకుతారు. తర్వాత కరక్కాయను పొడి చేసి దాన్ని పాలల్లో వేసి వస్త్రాలకు పట్టిస్తారు. అనంతరం బాగా ఎండబెడతారు. పూర్తిగా ఆరిన తర్వాత దానిపైన వేర్వేరు డిజైన్లతో ఉన్న చెక్క బ్లాకులతో రంగులను అద్దుతారు. కలంకారీ కోసమే రూపొందించిన డిజైన్ల చెక్క బ్లాకుల తయారీ అనుబంధ పరిశ్రమగా కొనసాగుతోంది. ఈ చెక్క బ్లాకులను ఆర్గానిక్ రంగుల్లో ముంచి కలంకారీ వస్త్రంపై ముద్రించడం గొప్ప కళ. బొగ్గుతో ఏ ఆర్ట్ ఎలా ఉండాలో మార్కింగ్ వేసుకుంటారు. తర్వాత బెల్లపునీళ్లు, ఇనుప ముక్కలతో తయారైన కసిమితో బ్లాక్ రైటింగ్ చేస్తారు. పటిక వేసి, తర్వాత మళ్లీ ఉతుకుతారు. అనంతరం మళ్లీ ఉడకబెట్టి, పాలలో ముంచి ఆరబెట్టిన తర్వాత సహజ రంగులను వాటికి పట్టిస్తారు. కలంకారీ అద్దకపు రంగుల్లో సహజసిద్దంగా దొరికే ముడి సరుకులనే ఉపయోగిస్తారు. కళాకారులే తమ రంగులను తయారు చేసుకుంటారు. అన్ని రంగులకూ నాలుగు రంగులే ఆధారం. అవి సిద్ధమయ్యాక, వాటిని మిళితం చేయడం ద్వారా మిగతా రంగులు తెప్పిస్తారు.