
janasena chief pawan kalyan tweets against decentralization draws strong counters from ysrcp
ఏపీలో వికేంద్రీకరణకు మద్దతు పెరుగుతున్న వేళ.. దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా తీవ్రమవుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వికేంద్రీకరణ పట్ల తన వ్యతిరేకతను మరోసారి బయటపెట్టారు. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15న విశాఖపట్నంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’ను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికా మూడు రాజధానులు అంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తాజా ట్వీట్స్‌పై వైసీపీ వర్గాలు అంతే స్థాయిలో కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టాయి. ప్యాకేజీ కోసం మొరిగేవాళ్లకు గర్జన అర్థమవుతుందా అంటూ మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దత్త తండ్రి తరుపున దత్త పుత్రుడి మియావ్ మియావ్ అంటూ పవన్ కల్యాణ్‌పై మరో మంత్రి గుడివాడ అమరనాథ్ సెటైర్స్ వేశారు.
పవన్ సంధించిన ప్రశ్నలకు స్ట్రాంగ్ కౌంటర్స్
దేనికి గర్జనలు.. ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా? అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీనికి వైసీపీ వర్గాలు ధీటుగా బదులిస్తున్నాయి. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు ఎంతలా తగ్గాయో లెక్కలతో సహా చెబుతున్నారు.
2018-19లో లిక్కర్ అమ్మకాలు 384.31 లక్షల కేసులు కాగా, 2021–2022లో అది 278.5 లక్షలుగా ఉంది. అంటే 105.81 లక్షల కేసులు తగ్గాయి. 2018–19లో బీర్ల అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా, 2021–2022లో అది 82.6 లక్షల కేసులుగా ఉంది. అంటే 194.6 లక్షల కేసులు తగ్గిపోయాయి. మద్యపాన నియంత్రణకు జగన్ సర్కార్ కట్టుబడి ఉందని.. ప్రభుత్వం నిర్ణయంతో మద్య వినియోగం తగ్గిందని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దేనికి గర్జనలు.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా? అంటూ మరో ట్వీట్లో పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి వైసీపీ వర్గాలు ధీటుగా స్పందిస్తున్నాయి. గత టీడీపీ హయాంలో 123.52 శాతం మేర అప్పులు పెరిగితే, వైసీపీ పాలనలో పెరిగింది కేవలం 47.95 శాతం మాత్రమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి కేవలం 1.29 లక్షల కోట్లుగా ఉన్న అప్పు.. టీడీపీ ఐదేళ్ల పాలనలో 2.69 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పులు తక్కువేనని… తక్కువ అప్పులతోనే ప్రజలకు ఎక్కువ మేలు చేసే పథకాలను జగన్ సర్కార్ అమలుచేస్తోందని చెబుతున్నారు.
దేనికి గర్జనలు.. ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా..? ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేసుకున్నందుకా? మట్టి కూడా తినేస్తున్నందుకా? అంటూ పవన్ చేసిన మరో ట్వీట్‌కు కూడా గట్టి కౌంటర్స్ పడుతున్నాయి. ఇసుక క్రయవిక్రయాల్లో పారదర్శకత కోసమే సీఎం జగన్ స్పెషల్ పాలసీ తీసుకొచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలోనే బిడ్డింగ్ జరుగుతోందని.. సెక్యూరిటీగా ప్రభుత్వం రూ.120 కోట్లు పెట్టుకుంటోందని.. జనాలకు తక్కువ ధరకే ఇసుకను అందించేలా ప్రభుత్వమే ధరను ఫిక్స్ చేస్తోందని చెబుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇసుక రీచ్‌లు పెడుతున్నాం.. బిడ్డింగ్‌కు తగినట్లుగానే తవ్వకాలు జరుగుతున్నాయి.. అక్రమాలు జరిగితే ఫిర్యాదు ఇచ్చేందుకు 14500 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశాం.. ఇక అక్రమాలు ఎక్కడ జరుగుతున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు.