
Janasena chief pawan kalyan sudden vizag visit amid vishakha garjana rises many doubts
ఓవైపు అమరావతి ఉద్యమం.. మరోవైపు మూడు రాజధానుల ఉద్యమం… రాష్ట్రంలో ఏకకాలంలో రెండు ఉద్యమాలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండుతో దాదాపు గత మూడేళ్లుగా అమరావతి ఉద్యమం సాగుతోంది. ఇది అమరావతి రైతుల ఉద్యమంగా చెబుతున్నప్పటికీ.. పక్కా టీడీపీ డైరెక్షన్లో సాగుతున్న పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమమని అధికార వైసీపీ పదేపదే విమర్శలు గుప్పిస్తోంది. ఎన్ని విమర్శలొచ్చినా ఈ ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు బలమైన ప్రయత్నం జరుగుతోంది. గతంలో అమరావతి-తిరుపతి, ఇప్పుడు అమరావతి-అరసవెల్లి యాత్రతో ఈ ఉద్యమం ప్రజల్లోకి వెళ్తోంది. దీనికి కౌంటర్‌గా.. అంతే స్థాయిలో ఇప్పుడు ‘వికేంద్రీకరణ’ ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు జేఏసీ పురుడు పోసుకుంది. మొదటి కార్యాచరణగా ఈ నెల 15న ‘విశాఖ గర్జన’ కార్యక్రమాన్ని ప్రకటించారు.
జేఏసీ తమ కార్యాచరణ ప్రకటించిన వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ‘దేనికి గర్జనలు’ అంటూ వికేంద్రీకరణపై తన వ్యతిరేకతను చాటుకున్నారు. అంతేకాదు, ‘విశాఖ గర్జన’ తలపెట్టిన రోజునే విశాఖలో తన పర్యటన ఖరారు చేశారు. విశాఖ పర్యటన సందర్భంగా జనసేన రోడ్ షో ఉండొచ్చునని చెబుతున్నారు. విశాఖ గర్జన రోజే విశాఖ గడ్డపై అడుగుపెడుతున్న పవన్.. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా నినదించబోతున్నారా.. అదే జరిగితే ఉత్తరాంధ్ర గడ్డ పైనే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను హేళన చేయడమే తప్ప మరొకటి కాదు. లేదా కేవలం తన హడావుడితో విశాఖ గర్జన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆగమేఘాల మీద పవన్ అక్కడ పర్యటిస్తున్నారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఈ నెల 15,16, 17 తేదీల్లో పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనసేన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విశాఖ గర్జన సందర్భంలోనే పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించడంపై అధికార పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్ మేరకే పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఉత్తరాంధ్రలో వాలిపోతున్నారని ఆరోపిస్తున్నారు. పవన్ ప్యాకేజీ తీసుకుని మొరుగుతున్నాడని.. ఇన్నాళ్లు నిద్రపోయి ఇప్పుడే నిద్రలేచిన కుంభకర్ణుడని.. ఇలా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా ఒకేరోజు అటు ఉత్తరాంధ్ర గర్జన, ఇటు పవన్ కల్యాణ్ పర్యటనతో విశాఖలో హైటెన్షన్ వాతావరణం తప్పేలా లేదు. వికేంద్రీకరణకు మద్దతుగా సాగుతున్న ఉద్యమాన్ని పవన్ నేరుగా వ్యతిరేకించినట్లయితే.. ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతిఘటించకుండా ఉంటారా.. ఇవన్నీ గమనిస్తే ఈ నెల 15న విశాఖలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.