
kuppam
2019 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న వైసీపీ.. 2024లో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. అందుకు సంబంధించిన వ్యూహాలను ఇప్పటి నుంచే రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లను గెలుచుకునే దిశగా ముందుగా సాగాలని జగన్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఆ గెలుపు పరంపర టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచే మొదలవుతుందనే భావనను జగన్ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందులో భాగంగానే వైసీపీ నుంచి కుప్పంలో బరిలో బీసీ నేత భరత్ ను దింపాలని నిర్ణయించారు. ఆ వ్యూహంలో భాగంగానే వైఎస్సార్ చేయూత మూడో విడతను కుప్పంలో విడుదల చేశారు. ఆ వేదికపై కుప్పం అభ్యర్థి భరత్ అని స్పష్టం చేశారు. అంతేకాదు.. ‘ ఈ బీసీ బిడ్డను గెలిపిస్తే.. మంత్రిని చేస్తా’ అనే సంకేతాన్ని ప్రజలకు ఇచ్చారు.
వ్యూహాత్మకంగానే సీఎం జగన్.. కుప్పంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుప్పంలో సభ పెట్టడం ద్వారా ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబుకు చెక్ పెట్టే దిశగా పావులు కదిపారు సీఎం జగన్. 45ఏళ్ల రాజకీయ జీవితంలో.. 14ఏళ్ల సీఎం కెరీర్లో చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని, వారికి చేసింది ఏమీ లేదని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ఇన్నాళ్లు కుప్పంలో అన్యాయానికి గురైను బీసీలకు సముచిత స్థానంలో కల్పించేందుకు సీఎం జగన్ పూనుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే జిల్లాలో మెజార్టీ ఓటు బ్యాంకుకు చెందిన బీసీ అభ్యర్థిని వైసీపీ బరిలోకి దింపాలని నిర్ణయించింది. తద్వారా ఇన్నాళ్లు చంద్రబాబు గెలవడానికి అండగా నిలిచిన బీసీలను టీడీపీకి దూరం చేయాలని వైసీపీ వ్యూహ రచన చేసింది.
కుప్పంలో బీసీ నేత భరత్ ను వైసీపీ తెరపైకి తెచ్చిన తర్వాత.. ఆ పార్టీ ఊహించని స్థాయిలో పుంజుకుందనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటడమే ఇందుకు నిదర్శనం. భరత్ ను ఎమ్మెల్సీ చేసి.. అతని ద్వారా కుప్పంలో పాలన సాగిస్తున్నారు సీఎం జగన్. శుక్రవారం జరిగిన సభ.. పార్టీ మరింత బలపడటానికి ఊతం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు నాయుడుకు సొంత ఇల్లు లేదని వైసీపీ చెబుతోంది. అంతేకాదు.. అక్కడ బాబుకు ఓటు హక్కు కూడా లేకపోవడం వంటి అంశాలను ఎత్తి చూపుతోంది. ఇది కచ్చితంగా చంద్రబాబుకు మైనస్ గా.. భరత్ కు ప్లస్ గా మారే అవకాశం ఉందనే విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కుప్పంలో చంద్రబాబు సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ భయానికే చంద్రబాబు కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటున్నారనే విషయాన్ని వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు పదే పదే వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా ముఖం కూడా చూడని చంద్రబాబు.. జగన్ భయం వల్ల.. తరుచూ జిల్లాకు, కుప్పానికి వస్తున్నారని వైసీపీ చెబుతోంది.
అయితే వైసీపీ వ్యూహంలో చంద్రబాబు చిక్కుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును చిత్తూరు, కుప్పానికి పరిమితం చేసే వ్యూహాన్ని.. వైసీపీ సమర్థంగా అమలు చేస్తోందని భావన వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ ఎక్కడ గెలిచినా.. గెలవకపోయినా.. కుప్పంలో గెలుపు అనివార్యం. వైసీపీ దూకుడును టీడీపీ తట్టుకుంటుందా? చంద్రబాబు కుప్పం బరిలో గిరిగీసి నిలబడి గెలుస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.