
Mandatory rural service for pg medicos
జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా పీజీ మెడికోలకు రూరల్ సర్వీస్‌ను తప్పనిసరి చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనతో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఒక సంవత్సరం పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సేవలందించాల్సి ఉంటుంది. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
ప్రస్తుత విద్యా సంవత్సరం 2022-23లో అడ్మిషన్ పొందనున్న వైద్య విద్యార్థులకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ వర్తించనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద సీట్లు పొందేవారు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏ కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు పొందేవారికి ఇది వర్తిస్తుంది. పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తయ్యాక ఆ విద్యార్థులు రూరల్ సర్వీస్‌కి వెళ్లేలా ప్రభుత్వం వారి నుంచి ముందు గానే ఒప్పంద పత్రం తీసుకోనుంది.
విద్యార్థుల నుంచి ఒప్పంద పత్రం..
పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసేవారు.. కోర్సులు పూర్తయ్యాక గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించాలి. ఇందుకోసం ప్రభుత్వం వైద్య విద్యార్థుల నుంచి కోర్సులో చేరేటప్పుడే ఒప్పంద పత్రం తీసుకుంటుంది. ఒప్పందం ప్రకారం కోర్సు పూర్తయిన 18 నెలల వ్యవధిలో నిర్దేశిత గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వీస్‌లో చేరాలి. లేనిపక్షంలో భారీ జరిమానా తప్పదు. పీజీ మెడికోలు రూ.40 లక్షలు, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసినవారైతే రూ.50 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్ని మెడికల్ కాలేజీల్లో విద్యార్థుల నుంచి ఒప్పంద పత్రాల స్వీకరణకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు
ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద 707 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో ఏ కేటగిరీ కింద 1142 సీట్లు ఉన్నాయి. వీరంతా కోర్సులు పూర్తయిన వెంటనే రూరల్ సర్వీస్‌కి వెళ్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ఆసుపత్రుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేవారు 2025-26లో తమ కోర్సులు పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత 18 నెలలో వ్యవధిలో వారు రూరల్ సర్వీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఏపీ వైద్య విధాన పరిషత్‌లో వీరిని నియమిస్తారు. అవసరాన్ని బట్టి డీఎంఈ పరిధిలోనూ వారి సేవలను వినియోగించుకుంటారు.