
house
- డిసెంబర్ 21 నాటికి పూర్తయ్యేలా చర్యలు
పేదలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. డిసెంబర్ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. సీఎం జగన్ సైతం కలెక్టర్లకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇళ్ల నిర్మాణం వేగంగా జరగడం వల్ల.. ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకునే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పేదలకు కూడా త్వరగా ఇళ్లను అందజేయవచ్చనే అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప.గో, బాపట్ల, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గృహనిర్మాణం మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. సత్యాసాయి జిల్లా, ప్రకాశం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
విశాఖపట్నంలో ఇప్పటివరకు 1.24 లక్షల ఇళ్లను కేటాయించింది ప్రభుత్వం. అక్టోబరు నాటికి అన్ని ఇళ్ల పనులు ప్రారంభం అయ్యేలా యంత్రాంగం చర్యలు తీసుకోబోతోంది. పీఎంఏవై–వైయస్సార్ – గ్రామీణ కింద మంజూరైన ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇదిలా ఉంటే.. పూర్తయిన పనులకు సంబంధించి పేమెంట్లు కూడా ఎప్పటికప్పుడు విడుదలయ్యేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది.
ఆప్షన్ –3 కింద 3.27 లక్షల ఇళ్లను నిర్మించేలా అధికార యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, ఆదోని, తిరుపతి, జీవీఎంసీ లే అవుట్లకు సంబంధించి.. జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు కూడా చేశారు.
ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. డిసెంబర్ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. ఇందులో జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇళ్లు పూర్తయ్యే నాటికి ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తోంది.
మిగిలిపోయిన లబ్ధిదారులకు డిసెంబర్లో ఫేజ్–3 కింద ఇళ్ల మంజూరుకు సంబంధించి కలెక్టర్లు కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఇళ్ల పంపిణీపై ఆడిట్ ను సమగ్రంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే 20 రోజుల్లో ఆడిట్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఇప్పటికే ఆదేశించింది. ఆ దిశగా అధికారులు పని చేస్తున్నారు.