
చిత్తూరు జిల్లాలో ఏపీ పోలీసులు తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలకు సన్నాహాలు చేస్తుండగా, పోలీసులు ఆంక్షలు విధించారు.
కేవలం పార్టీ కార్యాలయాల లోపలనే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో వేడుకలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో జన్మదిన వేడుకలను కార్యాలయాలకే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. కుప్పంలో రేపు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా, తిరుపతి రేణిగుంట ప్రాంతంలో జగన్ ఫ్లెక్సీలను తొలగించాలని పోలీసులు ఆదేశించారు. ఈ చర్యపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీసుల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.