
jagan kuppam tour
ఈ నెల 23న సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. సీఎం జగన్ పర్యటనను వైసీపీ ప్రతిష్ఠాత్మికంగా భావిస్తోంది. ఇది వైసీపీ వ్యూహాత్మక పర్యటనా? వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలవడానికి అధికార పార్టీ చేస్తున్న ప్రణాళికలో భాగమా? ఈ పర్యటనతో చంద్రబాబు ఇమేజ్ కు గండికొట్టాలన్న వైసీపీ కల నెరవేరుతుందా? జగన్ పర్యటనతో చంద్రబాబులో గుబులు మొదలైందా? అందుకే తరుచూ చిత్తూరుకు వెళ్తున్నారా? ఈ విషయాలను ఓసారి పరిశీలిద్దాం.
2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లను సాధించి తిరుగులేని విజయాన్ని అందుకున్న వైఎస్ జగన్.. 2024 పోరులో 175 స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగానే ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ గెలుపు కుప్పం నుంచే మొదలు పెట్టాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నెల 23న సీఎం జగన్ కుప్పంలో చేపట్టనున్న పర్యటనను అందుకు ఉపయోగించుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది.
సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ చాలా ప్రతిష్ఠాత్మంగా చేస్తోంది. కుప్పం పర్యటనలో వైఎస్సార్ చేయూత పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేయనున్నారు జగన్. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత వైఎస్ జగన్ కుప్పంలో పర్యటించబోతోండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
జగన్ పర్యటన నేపథ్యంలో కుప్పంలో వైసీసీ చాలా వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. ఇన్నేళ్లుగా చంద్రబాబు చేసింది ఏం లేదనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది వైసీపీ. ప్రధానంగా చంద్రబాబు వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. ఒకరకంగా చెప్పాలంటే అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని చెప్పాలి. తద్వారా టీడీపీని, చంద్రబాబును డిఫెన్స్ లోకి నెట్టాలని చూస్తోంది. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.
టీడీపీ భయపడిందా?
కుప్పంలో జగన్ పర్యటనను టీడీపీ అంత తేలికగా తీసుకోవడం లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని వైసీపీ కోలుకోలేని దెబ్బతీసింది. ఆ ఎన్నికల ఫలితాలు టీడీపీని కంగుతినిపించాయి. వైసీపీ దెబ్బకు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా టీడీపీ భయపడిందని ప్రచారం కూడా జరిగింది. కుప్పంలో వచ్చిన ఫలితాలను వైసీపీ కూడా ఊహించలేదు. ప్రయత్నిస్తే.. కుప్పంలో వైసీపీ గెలుపు అంత కష్టం ఏమీ కాదని భావించిన వైసీపీ.. ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. కుప్పంలో వైసీపీ నేత భరత్ ను ఎమ్మెల్సీ చేసి.. నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పజెప్పారు. చంద్రబాబు చేయని పనులను భరత్ చేయిస్తున్నారు జగన్. కుప్పంలో ఇది వైసీపీకి మైలేజ్ గా మారిందనే చెప్పాలి. జగన్ పర్యటన తర్వాత కుప్పంలో వైసీపీ ఇమేజ్ మరింత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీడీపీకి దడ..
కుప్పంలో జగన్ పర్యటన.. టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీ విజయాన్ని చూసిన టీడీపీ మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి. ఏకంగా చంద్రబాబు నియోజకవర్గంలోనే వైసీపీ ఆ స్థాయిలో పుంజుకోవడం.. టీడీపీకి ఎదురుదెబ్బే అని చెప్పాలి. కుప్పంలో బలపడుతూ వస్తున్న వైసీపీకి జగన్ పర్యటన బూస్ట్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో 175 సీట్ల గెలుపునకు కుప్పం నుంచే నాంది పలకాలని వైసీపీ వ్యూహ రచన చేస్తోంది.
చంద్రబాబు విజయ పరంపరకు చెక్ చెప్పేనా?
గతంలో చంద్రబాబు చిత్తూరుకు గానీ, కుప్పంకు గానీ తరచూ వెళ్లిన దాఖలాలు లేవు. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు కుప్పానికి వెళ్లేవారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక.. తరుచూ చిత్తూరుకు.. కుప్పానికి వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సొంత నియోజకవర్గంపై మరింత దృష్టి సారించారు చంద్రబాబు.
చంద్రబాబు రాజకీయ ఇమేజ్ తగ్గడం వల్లే.. కుప్పంలో వైసీపీ పుంజుకుదనే వాదన వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో ఒక వేళ వైసీపీ గెలిస్తే.. కుప్పంలో చంద్రబాబు శకం ముగిసినట్లే అవుతుంది. అంతేకాదు.. టీడీపీ అధినేత రాజకీయ భవిశ్యత్ కూడా ప్రశ్నార్థకంలో పుడుతుంది. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కంటే.. కుప్పంలో చంద్రబాబు గెలుపు ఆ పార్టీ ముందున్న ప్రథమ కర్తవ్యం. చంద్రబాబుకు కూడా అది అనివార్యం.