
pawan
2014 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అయితే ఆయన వ్యవహార శైలిపై మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి. రాజకీయాలను ఆయన సీరియస్ గా తీసుకోవడం లేదని, పార్ట్ టైమ్ వర్క్ గా భావిస్తున్నారనే ఆరోపణలు గతంలో చాలా వచ్చాయి.. ఇప్పుడు కూడా వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని.. పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పవన్ వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. ఆదివారం పార్టీ మీటింగ్ పెట్టుకొని.. పనిగట్టుకొని వైసీపీని విమర్శిస్తున్నారంటూ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు నాని.
ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం సభ లోపల, బయట ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలకు రక్తి కట్టిస్తున్నారు. మూడు రాజధానుల అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడంతో ఏపీ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఈ క్రమంలో సభలు జరిగిన రోజుల్లో స్పందించకుండా.. సెలవు రోజు అయిన ఆదివారం మీటింగ్ పెట్టారు పవన్. దీంతో ఇది వీకెండ్ పాలిటిక్స్ కాకపోతే మరేంటని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
పవన్ కల్యాణ్ 2019 నుంచి కాస్త క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. చంద్రబాబు హయాంలో ఆయన రాజకీయాల్లో అంత చురుగ్గా లేరనే ప్రచారం జరిగింది. ఎన్నికల సమయానికి పవన్ కాస్త యాక్టివ్ అయ్యారు. 2019 ఎన్నికల ప్రచారంలో విచిత్రంగా ఆయన అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపకుండా ప్రతిపక్షమైన వైసీపీని విమర్శించారు. దీన్ని సహించని ఆంధ్రా ప్రజలు పవన్ ను తిరస్కరించారు. ఈ క్రమంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వంపై చాలా ధీటైన విమర్శలు చేస్తున్నారు. అయితే జనసేన తరఫున ఆయన చేస్తున్న కార్యక్రమాలు దాదాపు వీకెండ్ లోనే ఉంటున్నాయని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి పవన్ వీకెండ్ లో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రధాన కారణం ఆయనకు సినిమా షూటింగ్ లు ఉండటం. షూటింగ్ లకు ఆదివారం విరామం ప్రకటించి.. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడతారని సమాచారం. అయితే అన్ని సందర్భాల్లో వీకెండ్ రాజకీయాలు కుదరవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల అంశంపై శాసన సభ దద్దరిల్లుతున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైన సమయంలో కూడా పవన్ వీకెండ్ సమావేశాలు చేయడం అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మాజీ జేడీ లక్ష్మీనారాయణకు కూడా అది నచ్చలేదు?
వాస్తవానికి సినిమాలు, రాజకీయాలను సమాంతరంగా నడిపిద్దామని పవన్ అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. షూటింగ్స్ లో బిజీగా ఉండి.. ఒకానొక దశలో పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు పవన్. పవన్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనను వీడారు. అయితే పవన్ తన తీరును మార్చుకోకుండా.. వీకెండ్ పాలిటిక్స్ ను కొనసాగిస్తున్నారనేది వైసీపీ నాయకుల ప్రధాన ఆరోపణ.
అయితే అన్ని సందర్భాల్లో వీకెండ్ రాజకీయాలు పనిచేయవని, నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడినే జనం నమ్ముతారని విశ్లేషకులు అంటున్నారు.