
NTR
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ పేరు పెట్టడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే.. వైసీపీపై ఘాటుగా స్పందిస్తున్నారు. యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టేవరకు పోరాటం చేస్తానని అంటున్నారు. పిల్లనిచ్చిన మామకు అన్యాయం జరుగుతుంటే.. కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందిస్తారు. ఎన్టీఆర్ కు అల్లుడైనా చంద్రబాబు కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు.
ఒకప్పుడు తన మామ ఎన్టీఆర్ నుంచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారనే ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వెన్నుపోటు దారు అనే ముద్ర కూడా పడింది. ఇదే విషయాన్ని ఇప్పుడు వైసీసీ తెరపైకి తెస్తోంది. సొంత మామను వెన్నుపోటు పొడిచి.. చనిపోయేలా చేసిన చంద్రబాబుపై వైసీపీ సభ్యులు తమదైన శైలిలో రెచ్చిపోతున్నారు.
యూనివర్సిటీ పేరు మార్చినంత మాత్రానే.. ఇంత యాగి చేస్తున్న చంద్రబాబు.. ఏకంగా మనిషి(ఎన్టీఆర్)నే లేకుండా చేశారని విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ కు వైసీపీ ఎలాంటి అన్యాయం చేయలేదని ప్రభుత్వం చెబుతోంది. పైగా ఒక జిల్లాకు పెద్దాయన పేరు పెట్టి గౌరవించినట్లు నాయకులు అంటున్నారు. ఏ అల్లుడు.. మామకు చేయని ద్రోహాన్ని ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసినట్లు బలమైన వాదన వినిపిస్తున్నారు.
ఇదే సందర్భంలో ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే విషయం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ భారత రత్న ఇచ్చే అవకాశం వచ్చినా.. దాన్ని చంద్రబాబే అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్నియార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చే అంశం పైన యార్లగడ్డ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ మహానాడులో ప్రతి ఏటా తీర్మానం చేస్తారని.. కానీ, చంద్రబాబు ఆలోచన వేరే ఉందన్నారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో డాక్టర్ సీ నారాయణ రెడ్డితో కలిసి తాను ప్రధానిని కలిసిన సందర్భాన్ని వివరించారు.
ఎన్టీఆర్ భారత రత్నకు అర్హులని చెబుతూనే.. చంద్రబాబు కారణంగానే ఇవ్వలేకపోయారని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి ఆ అవార్డును అందుకుంటారని.. అది ఆయనకు ఇష్టం లేదని వివరించారు. కారణాలు ఏవైనా ప్రభుత్వం యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పును ఆయన వ్యతిరేకించారు. అందుకే అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.