
rythu bharosa kendralu
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు( ఆర్బీకే) అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. రైతులకు క్షేత్రస్థాయిలో అన్ని రకాల వసతులను కల్పించే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ప్రవేశపెట్టింది. ఆర్బకేలు ఇస్తున్న మంచి ఫలితాలకు ఆసియా దేశాల ప్రతినిధులు ఫిదా అయ్యారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ఆధ్వర్యంలో బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా పసిఫిక్ సింపోజియంలో ‘వ్యవసాయ వ్యవస్థల పరివర్తన’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆర్బీకేలపై ప్రత్యేకంగా మాట్లాడారు.
రైతు భరసా కేంద్రాల ఏర్పాటు అనే ఆలోచన చాలా వినూత్నమైనదని, ల్యాబ్ టూ ల్యాండ్ సాంకేతికత అద్భుతం అంటూ ఆసియా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఈ సాంకేతికత పరిజ్ఞానాన్ని వ్యవసాయాధారిత దేశాలన్నీ ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సింపోజియంకు భారత్ తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ సుభాఠాకూర్, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య హాజరయ్యారు. మిల్లెట్ మిషన్ ఆఫ్ ఇండియాపై సుభాఠాకూర్ ప్రసంగించగా.. ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, అమలుతీరుపై పూనం మాలకొండయ్య పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేష్ ను ఫిదా అయిన ఆయా దేశాల ప్రతినిధులు.. ఆర్బీకేల అంశాన్ని తమ దేశాల దృష్టి తీసుకెళ్తామని చెప్పారు.
ఆర్బీకేలు ఒక గేమ్ చేంజర్ అని, అనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయని ఆసియా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఆర్బీకేల గురించి తమ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఆచరింపజేసేందుకు కృషిచేస్తామన్నారు. భారత్ వచ్చేందుకు తామూ ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లాదేశ్ మంత్రి మహ్మద్ అబ్దుర్ రజాక్ కూడా చెప్పారు. థాయ్‌లాండ్‌తో పాటు యూకే, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, వియత్నాం, జపాన్, సింగపూర్, హాంకాంగ్, కంబోడియా, టాంగో, కుక్, సోలోమోన్ ఐలాండ్స్ దేశాల వ్యవసాయ మంత్రులు, కార్యదర్శులు, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. జర్మనీ పరిశోధకులు జూలియా, రాబీర్, కార్మన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఎఫ్‌పీవోలను పరిశీలించారు. వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
” ఏపీలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అట్టడుగు స్థాయి రైతులకూ సమస్త సమాచారం అద్భుతంగా అందుతోంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ) కూడా రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం అభినందనీయం” -జూలియా, రాబీర్, కార్మన్, జర్మనీ పరిశోధకులు