
ఏపీలో రైతుల ఆర్ధిక వృద్ధికి మరో ముందడుగు పడనుంది. ఆధునిక వ్యవసాయ పద్దతులతో పంటల ఉత్పత్తిని పెంచడం, తద్వారా రైతుల ఆర్థిక ఎదుగుదలకు దోహదపడేందుకు జగన్ సర్కార్ కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ అనుసరించిన విధానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇండో-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక ఒప్పందం మేరకు ఏర్పాటు కానున్న ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ద్వారా దీనికి బాటలు పడనున్నాయి. పల్నాడు జిల్లాలోని నకరికల్లు మండలం నర్శింగపాడులో ఏ సెంటర్ ఏర్పాటు కానుంది. గతంలో సీఎం జగన్ ఇజ్రాయెల్‌లో పర్యటించిన సందర్భంగా అక్కడి వ్యవసాయ విధానాలను పరిశీలించి.. ఇజ్రాయెల్ టెక్నాలజీని ఏపీకి తీసుకురావాలని భావించారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌తో ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పల్నాడులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అందుబాటులోకి రానుంది.
పల్నాడు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ద్వారా స్థానిక పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఆయిల్, చిల్లీ బ్రికెట్స్ మొదలైన వాటిపై ప్రస్తుతం ఇజ్రాయెల్ బృందం ఈ ప్రాంతంలో పర్యటించి అవగాహన కల్పించనుంది. అంతేకాకుండా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను, ఉత్పత్తి నాణ్యతను పెంచడానికి రైతులకు సహాయం చేయనుంది. ఇది స్థానిక రైతుల ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు మార్గం సుగమం చేయడమే కాకుండా రైతులు పరిమిత విస్తీర్ణంలో కూరగాయలు, పండ్లను పండించడానికి షేడ్ నెట్ హౌస్, పాలీ హౌస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేయడంలో దోహదపడుతుంది.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏం చేస్తుంది..
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఇజ్రాయెల్ బృందానికి చెందిన యార్ ఇషెల్, అగ్రికల్చర్ అటాచ్ ప్రతినిధి మషవ్ నేతృత్వంలో కూరగాయల ఉత్పత్తిలో నూతన సాంకేతికతలను పరిచయం చేయడం, వ్యవసాయ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరగనుంది. కూరగాయల పంటలను పండించడంలో రైతులు మెరుగైన సాంకేతికతలను అనుసరించేలా వీరు ప్రోత్సహించనున్నారు. దీనిలో భాగంగా మిరప, క్యాప్సికమ్, యూరోపియన్ దోసకాయ, టొమాటో, గెర్కిన్స్ , పచ్చిమిర్చి, అధిక విలువైన సుగంధ ద్రవ్యాలు మొదలైన పంటలపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు.
రాష్ట్ర వ్యవసాయ రంగం
ఆంధ్రప్రదేశ్ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. పండ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో, కూరగాయల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇప్పటికీ గొప్ప ఉద్యానవన సంపదను రాష్ట్రం పొందుతోంది. రాష్ట్రంలో ఉద్యానవన పంటలు 17.84 లక్షల హెక్టార్లలో 312.34 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తిని కలిగి ఉన్నాయి. మామిడి, నారింజ, బొప్పాయి, అరటి ఉత్పత్తిలో రాష్ట్రం ముందువరుసలో ఉండగా కొబ్బరి, ఆయిల్ పామ్, జీడిపప్పు ప్రధాన తోటల పంటలుగా ఉన్నాయి. పండ్లు, కూరగాయల సాగుకు అనుకూలమైన స్థానిక నీటిపారుదల వనరులతో విభిన్నమైన వ్యవసాయ-వాతావరణ ప్రాంతాలు, వివిధ రకాల నేలలను ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ విభాగం కలిగి ఉంది. ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో ప్రధాన వాటాగా కూరగాయలు (44 శాతం), పండ్లు (50.5 శాతం). భారతదేశంలోనే 15.8 శాతం వాటాతో పండ్ల ఉత్పత్తిలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఏపీ ఉంది. రాష్ట్ర జీడీపీలో హార్టికల్చర్ 17.16 శాతం కలిగిఉంది. అంతేకాకుండా ఉద్యాన పంటలు రాష్ట్రంలోని స్థూల విస్తీర్ణంలో 30 శాతంవాటాను కలిగి ఉన్నాయి.