
- పథకాలతో ఊరూరా సంక్షేమ సంతకం
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో చెరగని ముద్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం ఒక బెంచ్ మార్క్ లాంటిది. కడప జిల్లా పులివెందుల నుంచి ఓటమి ఎరుగని నేతగా పేరున్న వైఎస్సార్ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఏపీ నేతగా తనదైన ముద్ర వేశారు. విద్యార్థి నాయకుడిగా, రూపాయి వైద్యుడిగా నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయి నేతగా వైఎస్సార్ ఎదిగిన క్రమం ఆదర్శనీయమని సీనియర్ రాజకీయవేత్తలంతా చెబుతారు.
ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను పాటించడమే రాష్ట్రాల కర్తవ్యమన్నట్లు కాంగ్రెస్‌లో పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు, పేదల సంక్షేమమే ముఖ్యమని ఢిల్లీలో తన వాణిని వినిపించారు. తన మాటను నెగ్గించుకుని నిధులు రాబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారా తన పట్టును నిరూపించుకున్నారు. రాజశేఖరరెడ్డి 2003 వేసవి కాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. పాదయాత్రతో వ్యక్తిగతంగా వైఎస్‌కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. 2004 మే నెలలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలుపైనే చేశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందగలిగారు వైఎస్సార్. పేద కుటుంబాలు పస్తులు ఉండకూడదని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తెచ్చారు. పెన్షన్లను పెంచి వృద్ధుల మోముల్లో సంతోషాన్ని నింపారు. అలాగే వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం జాతీయ స్థాయిలో బెంచ్ మార్క్ గా నిలిచింది. పేదలకు అందనంత దూరంలో ఉన్న కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆరోగ్యశ్రీదే. పెద్ద జబ్బేదైనా చేస్తే అయితే ఆస్తులమ్మడం లేదా కాటికెళ్లడంలా ఉన్న పరిస్థితిని సమూలంగా మార్చేశారు. పేదల వైద్యం కోసం పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించేలా ఆరోగ్యశ్రీని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేశారు. మరోవైపు ఆసుపత్రుల్లో వైద్యం మాట అటుంచితే అక్కడికి వెళ్లడానికే వేల రూపాయలు ఖర్చయ్యే పరిస్థితిని 108 వాహనాలతో మార్చేశారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతి మండలంలో అందుబాటులోకి తెచ్చిన 108 అంబులెన్సులు లక్షల మంది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి.
అలాగే వైఎస్సార్ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్ మెంట్ సంచలనంగా మారింది. పేద విద్యార్థులకు కార్పొరేట్ చదువులను పూర్తి ఉచితంగా అందించడంతో లక్షల కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. అలాగే వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజాక్షేమం కోసమే అన్నట్లుగా సాగాయి. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వైఎస్ఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, పెన్షన్ల పెంపు, పేదలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ పథకాలే 2009 ఎన్నికల్లో త్రిముఖ పోరులోనూ వైఎస్సార్‌కు తిరుగులేని విజయాన్ని అందించాయి.