
amaravati vs decentralization agitation
అమరావతి రైతుల పాదయాత్ర ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అడుగడుగునా పాదయాత్రను వ్యతిరేకిస్తూ నిరసన గళాలు వినిపిస్తున్నాయి. కేవలం కొంతమంది ఆకాంక్షను అందరిపై రుద్దవద్దని రాష్ట్ర ప్రజలంతా మొత్తుకుంటున్నా అమరావతి పాదయాత్ర చేస్తున్నవారికి అదేమీ పట్టట్లేదు. ప్రజా ఆకాంక్షను లెక్క చేయక.. తాము చెప్పిందే నడవాలనేలా సాగుతున్న వారి ధోరణిపై ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. పాదయాత్రకు అడ్డుపడి నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేని స్థితిలో.. పాదయాత్ర చేస్తున్నవారు భౌతిక దాడులకు తెగబడుతున్నారు.
రాజమండ్రిలో ఉద్రిక్తత :
అమరావతి పాదయాత్ర కారణంగా రాజమండ్రిలోని అజాద్ చౌక్‌లో ఇవాళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వికేంద్రీకరణకు మద్దతుగా అజాద్ చౌక్‌లో వైసీపీ బహిరంగ సభను చేపట్టగా… దీనికి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. అదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్ర అజాద్ చౌక్ వద్దకు వచ్చింది. వికేంద్రీకరణ సభలో పాల్గొన్నవారు అమరావతి పాదయాత్రను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు. అంతే.. పాదయాత్ర ముసుగులో ఉన్న కొందరు టీడీపీ నేతలు.. వికేంద్రీకరణ సభలో పాల్గొన్న ప్రజలపై చెప్పులు, బాటిళ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. మీసాలు తిప్పుతూ, సవాళ్లు విసురుతూ రెచ్చగొట్టేలా వ్యవహరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుతంగా సభలో పాల్గొన్న తమపై అమరావతి పాదయాత్రికులు దాడికి పాల్పడటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వికేంద్రీకరణకు మద్దతుగా అజాద్ చౌక్‌లో నిర్వహించిన సభకు హాజరైన స్థానికులపై అమరావతి పాదయాత్రికులు దాడికి పాల్పడటాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా ఖండించారు. ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో దాడులకు ప్లాన్ చేశారని ఆరోపించారు. అమరావతి పాదయాత్ర చేస్తున్నవారిలో బ్లేడ్ బ్యాచ్‌తో పాటు రౌడీ షీటర్లు ఉన్నారని ఆరోపించారు. ఇది అమరావతి రైతుల పాదయాత్ర కాదని.. టీడీపీ యాత్ర అని ఎంపీ పిల్లి సుభాష్ విమర్శించారు. రైతుల ముసుగులో టీడీపీ, జనసేనలు స్థానికులపై దాడులకు పాల్పడ్డారని అన్నారు.
‘వికేంద్రీకరణ ఉద్యమం’పై దాడి :
రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తున్న వేళ మంత్రుల కాన్వాయ్‌పై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తాజాగా రాజమండ్రిలోనూ అమరావతి పాదయాత్ర ముసుగులో వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నవారిపై దాడి జరిగింది. ఈ పరిణామాలను గమనిస్తే వికేంద్రీకరణ ఉద్యమాన్ని అణచివేసేందుకు దాడులకు సైతం తెగబడుతామనే సంకేతాలు పంపిస్తున్నట్లుగా ఉంది. ప్రజా ఆకాంక్షను గౌరవించకపోగా ఇలా దాడులతో దౌర్జన్యానికి దిగడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.