
Amaravati farmers
అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు మహాపాదయాత్ర విషయం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. నాటకీయ పరిణామాల మధ్య అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. దీంతో ఈ వివాదం వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి గతరాత్రి పాదయాత్రకు అనుమతి నిరాకరించారు డీజీపీ.
ఈ క్రమంలో అనుమతి కోసం అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 600 మంది పాదయాత్రలో పాల్గొనేందుకు పేర్లు ఇచ్చి ఐడీ కార్డులు ఇవ్వాలని సూచించింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. పాదయాత్ర ముగింపు రోజు బహిరంగ సభ అనుమతి కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని రైతులను కోర్టు ఆదేశించింది.
గత రాత్రి ఏం జరిగిందంటే..
అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు అనుమతివ్వాలని రైతులు డీజీపీకి వినతిపత్రం అందజేశారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు.
ఉత్తర్వులో ఉన్నది ఇదీ..
‘మీరు సెప్టెంబర్ 12 నుంచి మహాపాదయాత్ర చేయడానికి అనుమతి కోరారు. దానిలో 200 మందికి పైగా పాల్గొంటారని, ఒకవేళ ఆ సంఖ్య బాగా పెరిగితే ఒక్కో బృందంలో 200 మందికి మించకుండా వేర్వేరు బృందాలుగా వెళతామని చెప్పారు. మేం మీరు పంపిన విజ్ఞప్తిని ఆయా జిల్లాల పోలీసు అధికారులకు పంపి అభిప్రాయం కోరాం. మీ విజ్ఞప్తిని, వారి అభిప్రాయాలను పరిశీలించిన మీదట ఈ కింది ఉత్తర్వులిస్తున్నాను. గతేడాది మీరు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు. అప్పుడు కూడా కోర్టు ఆదేశాలతో కొన్ని షరతులతో మీకు అనుమతిచ్చాం. పాదయాత్రలో మీరు ఆ షరతులన్నీ ఉల్లంఘించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసి గాయపరచటం, వారిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వంటి నేరాలకు పాల్పడ్డారు. అందుకు వివిధ జిల్లాల్లో మీపై 71 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ అంశాల్ని, విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నాం’ అని డీజీపీ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.