
మగ్గం మీద నేసే చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో డిమాండ్ ఉంది. ఏపీలోని పెడన, మంగళగిరి, చీరాలలో మగ్గం మీద రూపొందించే వస్త్రాలకు గొప్ప పేరు ఉంది. పవర్ లూమ్స్, యంత్రాల మీద తయారు చేసే చీరలు, వస్త్రాలు చూడటానికి బాగుంటాయి. కానీ చేతితో, మగ్గం మీద నేసే వస్త్రాలు నాణ్యతతో ఉంటాయి. పేదల నుంచి ఉన్నత వర్గాల వరకు ముచ్చటగా కొనేవి చేనేత వస్త్రాలే. ఫ్యాషన్ షోలలో హొయలొలికించే అందాల భామలకు చేనేత వస్త్రాలు పెట్టని ఆభరణాలు. చేనేత వస్తాలు అంటూనే ఒక విధంగా గర్వపడతాం. అవి ఇచ్చే హుందాతనం మరే వస్త్రం ఇవ్వలేదు. ఇక షోకేసుల్లో చేనేత వస్తాలు అలంకరించిన ఆ బొమ్మల్ని చూస్తుంటే చూపుతిప్పుకోలేం. అయితే ప్రశస్తమయిన వస్త్రాలను తయారుచేసేందుకు వాడే చిన్న సాదాసీదా పరికరమే మగ్గం.
చెక్కతో తయారయ్యే మగ్గం నుంచి ఇంత కళ ఉట్టి పడుతుందంటే నమ్మశక్యం కాదు. చేనేత వస్త్రాలను కోట్లాది మంది ధరిస్తున్నా, వారిలో ఎక్కువ మందికి మగ్గం ఎలా ఉంటుందో తెలియదు. ఏపీ, తెలంగాణల్లోని వేర్వేరు ప్రాంతాల్లో మగ్గంపై నేస్తుంటారు. అయితే ఆయా ప్రాంతాల్లో మగ్గం స్వరూపం మారుతుంటుంది. మగ్గంపైకి నూలు ఎక్కించే ముందు రాట్నంపై వడుకుతారు. అనంతరం మగ్గంపై వివిధ రంగుల దారాలు, జరీలను ఉపయోగించి వస్త్రాలు నేస్తారు. అత్యంత తేలికైన, బరువైన పట్టు వస్త్రాలనూ నేసిన ఘనత తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులకే దక్కుతుంది. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను కూడా మగ్గంపై తయారు చేసి చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు. అలాంటి చేనేత మగ్గం ఇప్పుడు కళ తప్పుతోంది. పవర్ లూమ్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రం లోపాలు లేకుండా బయటకు రావడం ఒక కారణం. యంత్రాల ద్వారా తక్కువ ఖర్చు కావడం కూడా మరో కారణం. దీంతో వేలాది మంది నేతన్నలు మగ్గాలను వదిలి, వేరే పనులకు వెళ్తున్నారు.