
Gram panchayat employees strike
- 9 ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీస్
- వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే
- అక్టోబరు 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మె
ఏపీలో గ్రామ పంచాయతీ శాఖ ఉద్యోగులు అక్టోబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 9 ప్రధాన డిమాండ్లతో సీఐటీయు అనుబంధంగా ఉన్న ఉద్యోగ, కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. లేదంటే గ్రామ స్వరాజ్యానికి ప్రతీక అయినా మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన సమ్మె బాట పడతామని ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు నోటీస్ అందేజేశాయి.
గ్రామ పంచాయతీ శాఖ ఉద్యోగులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని గ్రామ పంచాయతీ శాఖ ఉద్యోగ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వీలైనంత తొందరగా చెల్లించాలని అన్నారు. పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్లకు కనీస వేతనంగా రూ. 20వేలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. నెలకు రూ. 6 వేల చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని నేతలు కోరారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా సాధారణ మృతికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా పంచాయతీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం వెంటనే ఆపేయాలని లేదంటే అక్టోబర్ 2 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే…
1. వెంటనే బకాయి జీతాలు చెల్లించి కార్మికుల కుటుంబాలను కాపాడాలి
2. నెలకు రూ.6 వేల చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి
3. పంచాయతీ కార్మికులకు, గ్రీన్ అంబాసిడర్లకు కనీస వేతనంగా నెలకు రూ.20 వేలు చెల్లించాలి
4. రక్షణ పరికరాలు, ఏకరూప దుస్తులు సకాలంలో అందించాలి
5. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షలు, సాధారణ మృతికి 5 లక్షలు అందించాలి.
6. ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి
7. కార్మికుల తొలగింపులు ఆపాలి
8. జీవో 551 రద్దు చేయాలి
9. జీవో 132ను అన్ని స్థాయిల్లో అమలు చేయాలి