
women empowerment
సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే ప్రగతికి మూలం. ఇదే నినాదంతో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మూడేళ్లలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామంటున్నారు నాయకులు. అంతే కాకుండా.. పరిపాలనలోనూ మహిళలకు పెద్ద పీట వేసినట్లు.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల్లో స్త్రీలకు సముచిత స్థానాన్ని తాము కల్పించినట్లు జగన్ సర్కారు ఢంకా బజాయించి చెబుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?
మహిళల కోసం చట్టాలు చేసిన తొలి ప్రభుత్వం తమదేనని వైసీపీ సర్కారు చాటి చెబుతోంది. మహిళలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కేటాయించి అమలు చేస్తున్నారు సీఎం జగన్. అసెంబ్లీలో 15 మంది మహిళలుంటే అందులో 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉండట గమనార్హం.
చంద్రబాబు ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులివ్వగా.. జగన్ నలుగురు మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. మొదటి మహిళా సీఎస్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా మహిళ అయిన నీలం సాహ్నికి అవకాశం కల్పించిన ఘనత జగన్‌దే. మైనారిటీ మహిళ జకియా ఖానమ్‌ను శాసనమండలి వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నుకుని మహిళా పక్షపాతిగా నిలిచిన ప్రభుత్వంగా నిలిచింది.
- 13 జిల్లా పరిషత్ చైర్ పర్సన్లలో ఏడుగురు మహిళలు (54 శాతం), వైస్ చైర్ పర్సన్లుగా 15 మంది మహిళలే.
- మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, డిప్యూటీ మేయర్లు 36 పదవులు ఉంటే… ఇందులో 18 పదవుల్లో మహిళలనే కూర్చోబెట్టారు.
- 75 మున్సిపాలిటీల్లో 73 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. ఇందులో 45 మంది మహిళలు చైర్పర్సన్లుగా ఉన్నారు.
- సర్పంచ్ పదవుల్లో 57 శాతం మహిళలే.
- ఎంపీటీసీల్లో 54 శాతం, మండల అధ్యక్షుల(ఎంపీపీలుగా) స్థానంలో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం పదవులు మహిళలకే కేటాయించారు వైఎస్ జగన్.
- 1154 డైరెక్టర్ పదవులకుగాను 586 పదవులు మహిళలకే దక్కాయి.
- 202 మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ పదవుల్లో 102 స్థానాల్లో మహిళలు.
- 1356 రాజకీయ నియామకాల్లో 688 పదవులు (51 శాతం) మహిళలకే కేటాయించారు.
- 2.60 లక్షల మందికి వలంటీర్ ఉద్యోగాలు ఇస్తే.. వీరిలో కూడా 53 శాతం మహిళలకే కేటాయించారు.
- కేవలం జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ వంటి నాలుగు పథకాల ద్వారా మాత్రమే మూడేళ్లలో మహిళల అకౌంట్లో నేరుగా రూ. 51 వేల కోట్లు జమ చేయడం జరిగింది.
- మహిళల రక్షణ కోసం వినూత్నంగా దేశంలో తొలిసారిగా దిశ యాప్‌ను ప్రవేశపెట్టారు.
ఇప్పటి వరకు మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ఇవన్నీ చేసినట్లు వైసీపీ చెబుతోంది. వారి సంక్షేమం కోసం ఇంకా చాలా చేయబోతున్నట్లు వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నాారు.