
gudivada amarnath
రాష్ట్రంలో ఇప్పుడు మూడు రాజధానుల విషయం హాట్ టాపిక్ మారింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మూడు రాజధానుల అంశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే.. అధికార వికేంద్రికరణ జరిగి తీరాల్సిందేనని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు. హైదరాబాద్ ను గుణపాఠంగా తీసుకొని.. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకృతం చేసే ఉద్దశం లేదని జగన్ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. దశల వారీగా అధికార వికేంద్రికరణ జరుగుతుందని సీఎం జగన్ ఇప్పటికే చెప్పారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
వచ్చే విద్యాసంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన ఉంటుందని మంతి అమర్ నాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో విశాఖను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్మెంట్ మీట్ ఉంటుందన్నారు. విశాఖలో భూ ఆక్రమణల ఆరోపణలు తెదేపా నిరూపించాలని సవాల్ విసిరారు. విశాఖలో రాజధానికి సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోలేదన్నారు. అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటేనా? అని ప్రశ్నించారు. రైతుల పాదయాత్ర సందర్భంగా విశాఖలో ఏం జరిగినా చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.
గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఎంత సీరియస్ అలోచిస్తోందో అర్థం అవుతుంది. త్వరలో ఈ విషయంపై జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నారు. మూడు రాజధానుల విషయంపై జగన్ ప్రభుత్వం దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో అధికార పక్షం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.