
ysr aarogyasri
పేద ప్రజలకు మరింత మేలు చేకూరే విధంగా అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కొత్త చికిత్సలను చేర్చనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో ఆరోగ్యశ్రీ పరిధిలోని మొత్తం ప్రొసీజర్ల సంఖ్య 3,254కు పెరగనుంది. 2007లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గొప్ప ఆలోచనతో 942 ప్రొసీజర్స్ తో ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. వై.ఎస్. జగన్ అధికారంలోకి రాగానే 1059 ఉన్న ప్రొసీజర్స్ ను.. 2,446కు పెంచారు. ఈ నెల 15 నుంచి 3,254 ప్రొసీజర్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ఇదే విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని వెల్లడించారు. ఎంత ఖర్చైనా పేదవాడికి మంచి వైద్యం అందించడానికి జగనన్న ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గతప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కేవలం 117 ప్రొసీజర్లు మాత్రమే పెంచిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఏటా 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని, గత మూడేళ్లలో 6 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. హై ఎండ్ ప్రొసీజర్స్ కి అదనంగా అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
వైద్య సేవల విషయంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ గా నిలిపేందుకు సీఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మరిన్ని చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కిందకి తెచ్చారు. అన్ని రంగాల కంటే.. సీఎం జగన్ వైద్యంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాడు-నేడు కింద 16 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఏటా రూ.13 వేల కోట్లు వైద్య, ఆరోగ్య రంగానికి ఖర్చు చేస్తోంది.
ఇదిలా ఉంటే.. మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకు సాగుతోంది. గతంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. మన్యం జిల్లాతో కలిపి మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఇందు కోసం దాదాపు రూ.8 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో రూ.3,820 కోట్లతో నాడు-నేడు కింద ఆధునీకరణ చేస్తూ ముఖ్యమంత్రి వైద్య రంగానికి మహర్థశ తీసుకొస్తున్నారు.
రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది. 85 శాతం మంది కార్డుదారులు.. ఆరోగ్యశ్రీ పరిధిలోని సేవలను అందిస్తోంది.