
Former Minister Narayana
టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్ కేసులో గతంలో నారాయణ బెయిల్ పొందిన విషయం తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లా న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా నవంబర్ 30లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించిన విషయం తెలిసిందే. ఆ కేసులో న్యాయస్థానం నారాయణకు బెయిల్ మంజూరు చేసింది.
దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 30వ తేదీ లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో దర్యాప్తులో మళ్లీ కదలిక మొదలైనట్లే.