
cm jagan
రైతుల కుటుంబాల్లో వెలుగు నింపడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకోసం అనేక రకాల కార్యక్రమాలను తీసుకొచ్చింది. జగన్ సర్కారు ఆందించిన చేయూత కారణంగా ఈ ఏడాది రాష్ట్ర సగటు ఆహార ఉత్పత్తి 167.24 లక్షల టన్నులకు చేరుకోవడం గమనార్హం. గత ఐదేళ్ల సగటుతో పోలిస్తే ఈ ఏడాది ఆహార ఉత్పత్తులు 13.24 లక్షల టన్నులు పెరిగాయి. ఈ వృద్ధికి గల కారణాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్టుబడి సాయం..
రైతులకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 13,500 ఆర్థిక సాయం అందిస్తోంది. ఏడాదికి మూడు విడతల్లో.. ఖరీఫ్, రబీ సీజన్లలో అందిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా ఫథకం కింద మూడున్నరేళ్లలో రూ. 25,971 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. కేవలం వైఎస్సార్ రైతుభరోసా పథకం కిందనే దాదాపు 50 లక్షల మంది రైతులకు సీఎం జగన్ ప్రభుత్వం రూ.25,971 కోట్ల సాయం అందించింది. అంటే ప్రతి ఏటా రూ. 7 వేల కోట్లు చొప్పున ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తోంది. మూడేళ్లలో కుటుంబానికి ప్రతి రైతు కుటుంబానికి రూ. 51 వేల సాయం అందింది. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులకు, దేవాదాయశాఖ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, గిరిజన ప్రాంతాల్లో ఆర్వోఎఫ్ఆర్ పట్టాల ద్వారా భూములు సాగు చేసుకుంటున్న వారికి కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ.13,500 సాయం అందుతోంది. పెట్టుబడి సాయంతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ, రైతులకు సున్నా వడ్డీ పథకం పేరుతో ఆర్థిక సాయం అందించింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.33 లక్షల కోట్లను రైతులకు చేర్చింది. ఇంత భారీ సాయంతో వ్యవసాయం రంగానికి ఊతం లభించింది.
వర్షాలు సమృద్ధిగా..
గత మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్క మండలం కూడా కరువు మండలంగా లేదని నివేదికలు చెబుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు రైతులకు పెట్టుబడి కోసం అందించిన సాయంతో వ్యవసాయ రంగం వృద్ధిలోకి వచ్చింది. రాష్ట్రంలోని కరువు మండలాల నివేదికల ప్రకారం 2014లో 238, 2015లో 359, 2016లో 301, 2017లో 121, 2018 ఖరీఫ్ లో 347, 2018లో రబీలో మరో 257 కరువు మండలాలను ప్రకటించారు. 26 జిల్లాల్లో ఈ మూడున్నర సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే పరిస్థితి లేదు. వ్యవసాయ రంగ వృద్ధి దూసుకుపోతూ దేశ ఆహార ఉత్పత్తుల సగటులో కీలక పాత్ర పోషిస్తోంది.
రుణాలు 50 శాతానికి పైగా పెంపు..
వ్యవసాయ రంగానికి దన్నుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే వ్యవసాయ రుణాలను 50 శాతానికి పైగా పెంచింది. గత ఐదేళ్లలో రూ. 5,48,518 కోట్లను రైతులకు వ్యవసాయం రుణంగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ మొత్తాన్ని గత టీడీపీ హయాంలోని ఐదేళ్లతో పోలిస్తే అప్పట్లో రైతులకు ఇచ్చిన వ్యవసాయ రుణాలు కేవలం రూ.3,64,624 కోట్లుగా ఉన్నాయి. దీంతో పాటు చంద్రబాబు హయాంలో పంటల బీమా సొమ్ములో రైతుల వాటాను రైతులే కట్టేలా అప్పటి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన వాటా సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో రైతులు పంట బీమాలను పొందడంలో తీవ్రంగా నష్టపోయారు. టీడీపీ పరిపాలనలో ఐదేళ్లకు కలిపి 30.85 లక్షల మంది రైతులకు కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే పంట బీమా పరిహారంగా దక్కింది. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం మూడేళ్ల కాలంలోనే 44.28 లక్షల మంది రైతులకు రూ.6,684 కోట్లు బీమా మొత్తం అందించింది. ఈ బీమా ప్రీమియం చెల్లించడంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే భరించి రైతులకు పంటలకు ఢోకా లేకుండా చేసింది.
ఆర్బీకేల పాత్ర..
రైతన్నల కోసం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇథియోపియా లాంటి దేశాలు రాష్ట్రంలో అమలవుతున్న ఆర్బీకేల నమూనాను తమతో పంచుకోవాలని కోరింది. దీంతో పాటు ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా గుర్తించింది. ఆర్బీకేల ద్వారా రైతులు వేసిన ప్రతి పంటను పక్కాగా ఈ క్రాప్ నమోదు చేస్తున్నారు. దీంతో పాటు బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుండటంతో రైతుల తరుపున వ్యవసాయ విస్తరణాధికారులు ఆర్బీకేల్లో రైతులకు విత్తనాలు, ఎరువులు అందిండం, ఈ క్రాప్ బుకింగ్ చేయడం, పండిన పంటను కోనుగోలు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు పండించిన పంటకు లాభసాటి ధర లభించేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంత కృషి చేస్తోంది. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షల కోసం గతంలో ఉన్న 12 ల్యాబుల స్థానంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ల్యాబ్ చొప్పున 147 ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఇప్పటికే 70 ల్యాబులు రైతులకు సేవలు అందిస్తుండగా మిగిలిన 77 ల్యాబుల నిర్మాణ దశలో ఉన్నాయి. దీనికి అదనంగా ప్రతి జిల్లాలో 2 ప్రత్యేక ల్యాబులు, రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతీయ కోడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.