
కలెక్టర్‌పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఆగ్రహం

తాడిపత్రిలో జేసీ సోదరులకు ఫైర్ బ్రాండ్ గా పేరున్న విషయం తెలిసిందే. స్థానికంగా భారీగా ఫాలోయింగ్ ఉన్న జేసీ కుటుంబం ఏం మాట్లాడినా సంచలనమే. గతంలో ఎమ్మెల్యేగా గెలిచి, గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఈ టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తాజాగా కలెక్టర్ పై నోటి దురుసు ప్రదర్శించి మరోసారి వార్తలకెక్కారు.
ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా?
భూసమస్యపై స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. సమస్యను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులకైతే అదేరోజు సాయంత్రానికే స్పందిస్తారు.. సామాన్యులు ఎన్నిసార్లు తిరిగినా చర్యలుండవా అని కలెక్టర్‌ను ప్రశ్నించారు. దీంతో కలెక్టర్.. జేసీకి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
స్పందన కార్యక్రమం ఎందుకు?
జిల్లా కలెక్టర్ సమస్యలపై స్పందించకపోతే ఇక స్పందన కార్యక్రమం ఎందుకని.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో భూ సంబంధిత సమస్యపై గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా యంత్రాంగం ఏ మాత్రం స్పందించకపోవటంతో.. మరోసారి ఫిర్యాదు చేయటానికి కలెక్టరేట్లో స్పందనకు వచ్చారు. తాను గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదని కలెక్టర్ నాగలక్ష్మిని, సంయుక్త కలెక్టర్ కేతన్గార్గ్లను ప్రశ్నించారు. స్పందనకు వచ్చే ప్రజలకు మేలు చేయండని,.. సమస్యలు పరిష్కరించండంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహంగా స్పందన కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బాధ్యతగా వ్యవహరించటం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.