
Ex minister perni nani slams janasena chief pawan kalyan over vizag tour
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నందుకు వైసీపీ నేతలు అసూయపడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘మూడు కాకపోతే ముప్పై పెళ్లిళ్లు చేసుకో.. భరణం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకున్నావు.. నువ్వా నీతులు చెప్పేది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌కు నిబద్ధత లేదని.. జనసేన కార్యకర్తలే సిగ్గుపడే రీతిలో ఆయన రాజకీయం ఉందని అన్నారు.
మంత్రులపై దాడికి పాల్పడినవారిని విడుదల చేస్తే తప్ప జనవాణి కార్యక్రమానికి వెళ్లనని పవన్ పేర్కొనడాన్ని పేర్ని నాని తీవ్రంగా తప్పు పట్టారు. నేరచరిత్ర కలిగినవారికి.. ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నవారికి కొమ్ముకాస్తున్నావంటే.. నువ్వు రాజకీయ నాయకుడివా లేక ఫ్యాక్షన్ ముఠాను నడుపుతున్నావా అంటూ ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమం ఏదో పెద్ద ప్రజా కార్యక్రమని పవన్ కల్యాణ్ చెబుతుంటారని… కానీ అదొక పెద్ద డ్రామా అని తామంటున్నామని పేర్కొన్నారు.
నిజానికి పవన్ కల్యాణ్ హోటల్ గదిని పర్మినెంట్‌గా అద్దెకు తీసుకుని.. అరెస్టయిన జనసేన కార్యకర్తలంతా విడుదలయ్యేంతవరకూ అక్కడే ఉంటారని భావించానని పేర్ని నాని అన్నారు. కానీ ఇంకా 8 మంది లోపల ఉండగానే… వారిని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారని అన్నారు. షూటింగ్ గ్యాప్‌లో 3 రోజులు ఖాళీ దొరికింది కాబట్టి పవన్ విశాఖ వచ్చారని… అందుకే అసలు విశాఖ నుంచి కదలనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు వెళ్లిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు నిజం చెప్తే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం ఉందని… పవన్ కల్యాణ్‌కి కూడా అలాంటి శాపమేదైనా ఉందేమోనని ఎద్దేవా చేశారు. అందుకే పవన్ కల్యాణ్ ఎప్పుడూ మాట మీద నిలబడరని… ఇవాళ ఒకటి, రేపొకటి చెబుతారని విమర్శించారు.
పవన్ కల్యాణ్‌కు ప్రజల కన్నా చంద్రబాబు మేలే ముఖ్యమని… తన అన్నయ్య కన్నా చంద్రబాబే బాగుండాలని కోరుకుంటున్నారని పేర్ని నాని అన్నారు. గతంలో అమరావతి కుల రాజధాని అని.. రాజధాని అయ్యే అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయని చెప్పి.. ఇప్పుడు మాట మార్చేశాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎవరి మాట భుజానికెత్తుకుంటాడో తెలియదని… రాజకీయాల్లో పవన్‌కు ఎలాంటి నిబద్దతత, నిజాయితీ లేదని విమర్శించారు. ఇలాంటి పవన్ కల్యాణ్ రాజకీయం పేరుతో తన ఫ్యాన్స్‌ను ఇంకెంత కాలం మోసం చేస్తాడో భగవంతుడికే తెలియాలన్నారు.