
Narayana
అమరావతి భూ అక్రమాల కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. భూములకు సంబంధించి అవకతవకలు జరిగాయని సీఐడీ అధికారులు నారాయణపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం నారాయణకు 3 నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాజధాని అమరావతి పరిధిలో ఎసైన్డ్ భూములను మాజీమంత్రి పొంగూరు నారాయణ తన బంధువులు, అనుచరులతో అక్రమంగా కొనిపించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో సీఐడీ అధికారులు మంగళవారం అయిదుగుర్ని అరెస్టుచేశారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు కొల్లి శివరామ్, గట్టెం వెంకటేశ్‌తో పాటు విశాఖపట్నానికి చెందిన చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ దొరబాబును అరెస్టు చేశారు. వీరిలో శివరామ్, వెంకటేశ్‌లను న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారిని జ్యుడిషియల్ రిమాండుకు ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్థనను ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలేనికి చెందిన యలమటి ప్రసాద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై 2020లో నమోదైన కేసులో ఈ అరెస్టులు చేశారు. మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు.. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కేవీపీ అంజనీకుమార్‌తో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీఐడీ తెలిపింది.