
Ethiopia praises rbks in ap
ఏపీలో సంక్షేమ విప్లవంతో దూసుకెళ్తున్న జగన్ సర్కార్‌కు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు దక్కుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలనే కాదు దేశాలనూ ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఆఫ్రికా దేశం ఇథియోపియా వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ ఆర్బీకే వ్యవస్థను ప్రశంసించారు. ఆర్బీకే వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు మెలెస్ మెకోనెన్ నేత్రుత్వంలో ఏపీకి వచ్చిన బృందం.. ఆర్బీకేలు అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని ప్రభుత్వ పనితీరును అభినందించారు. అంతేకాదు, ఈ వ్యవస్థను ఇథియోపియాలోనూ అమలుచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
‘ఆర్బీకే’లను పరిశీలించిన ఇథియోపియా టీమ్:
గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ)తో పాటు ఆర్బీకే చానెల్‌ను, కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలోని ఆర్బీకేను మెలెస్ మెకోనెన్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ చర్యల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సుమారు రెండున్నర గంటల పాటు అక్కడ గడిపిన ఇథియోపియా టీమ్ స్వయంగా రైతులతోనూ మాట్లాడారు.
కియోస్క్ ద్వారా రైతుల ఇన్పుట్స్ బుకింగ్, డిజిటల్ లైబ్రరీ, కొనుగోలు కేంద్రం, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రం, వెటర్నరీ అంబులెన్స్, రైతు రథం, పొలం బడి. . ఇలా అన్నింటినీ పరిశీలించారు. ఆర్బీకేల ద్వారా రైతుల కోసం జరుగుతున్న కృషిని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ సందర్భంగా ఇథియోపియా టీమ్‌కు వివరించారు. అనంతరం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆర్బీకే ద్వారా అందుతున్న సేవలు, కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అధికారులు ఇథియోపియా టీమ్‌కు వివరించారు.
రోల్ మోడల్‌గా నిలుస్తున్న ‘ఆర్బీకే’లు..
‘రైతు భరోసా కేంద్రాలు’ ఒక రోల్ మోడల్ అని ఇథియోపియా టీమ్ ప్రశంసించింది. ఆర్బీకే వ్యవస్థను తమ దేశంలోనూ అమలుచేసేందుకు ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకుంటామని తెలిపింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని తెలిపింది. వ్యవసాయాధారిత దేశమైన ఇథియోపియాలో రైతులకు ఇలాంటి సేవలు చాలా అవసరమని పేర్కొంది. రైతుల సంక్షేమం పట్ల సీఎం జగన్ ఆలోచనలు, ఆచరణ నిజంగా స్పూర్తిదాయకమని ఇథియోపియా వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ కొనియాడారు. ఆర్బీకేలు గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలు చాలా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. కియోస్క్ ద్వారా రైతులే స్వయంగా ఇన్పుట్స్ బుక్ చేసుకోవడం, సకాలంలో వాటిని అందించే చర్యలు అద్భుతమని కొనియాడారు. ల్యాబ్ టు ల్యాండ్ కాన్సెప్ట్‌ను ప్రశంసించారు. బహుశా ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సేవలు అందిస్తున్నట్లు వినలేదని పేర్కొనడం గమనార్హం.