
ఆంధ్రప్రదేశ్ లోని ఆరు పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రాజకీయ పార్టీల జాబితా నుంచి వాటిని తొలగించింది. ఏపీ నుంచి ఆల్ ఇండియా ముత్తాహిత ఖ్వామీ మహజ్, ప్రజా భారత్ పార్టీ, మనపార్టీ, భారతదేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ది సేవాల సమూహం పార్టీలు ఆ జాబితాలో ఉన్నాయి. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని కూడా జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించింది.
దేశంలో క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీలతో పాటు, వాటి గుర్తులను కూడా కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీ (ఆర్‌యూపీపీ)లను తమ జాబితా నుంచి తొలగించినట్టు ప్రకటించింది.
రిజిష్టర్ అయిన చాలా పార్టీలు యాక్టివ్‌గా లేకపోవడమే కాకుండా కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఈసీఐ మే 25న ఆర్‌యూపీపీల విధివిధానాలను అమలు చేసేందుకు ప్రారంభ చర్యల్లో భాగంగా ఢిల్లీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 86 పార్టీలను జాబితా నుంచి తొలగించగా, ఉనికిలోలేని మరో 253 పార్టీలను క్రియారహిత ఆర్‌యూపీపీలుగా ప్రకటించింది. 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీచేయక పోతే నమోదిత రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగిస్తామని ఈసీ తెలిపింది.