
durga devi
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. తొలుత గవర్నర్ దంపతులకు ఆలయ ఈఓ దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో మంగళవాయిద్యాలతో వేదమంత్రాల నడుమ పూర్ణకుంభం స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అమ్మవారిదర్శనంతో సకల శుభాలు చేకూరుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ అన్నారు.
అంతరాలయంలో అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించే ప్రాంతంలో అలంకరణ చేసే మహాద్భాగ్యాన్ని అర్చకులు భక్తులకు కల్పించారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారణ చూస్తూ భక్తులు కుంకుమ పూజ చేస్తున్నారు. గతంలో ఉత్సవ మూర్తికి కుంకుమ పూజ నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. అమ్మవారికే నేరుగా పూజ చేసే అవకాశం కలగడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దసరా మహోత్సవాల నేపథ్యంలో దుర్గమ్మ ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. రోజూ 30 వేల మందికి పైగా అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మూలా నక్షత్రం ఒక్క రోజే.. రోజుకు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీస్, రెవెన్యూ , మున్సిపల్, వైద్య ఆరోగ్య, ఆర్అండ్ బీ, పీడబ్ల్యూడీ, అగ్నిమాపక , ఇరిగేషన్, మత్స్య , సమాచార పౌర సంబంధాలు తదితర శాఖ అధికారుల సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజయవంతంగా జరుపుతామని ఆలయ అధికారులు చెబుతున్నారు.