
ysr cheyutha
45 ఏళ్ల వయసు నిండి అర్హత పొందిన మహిళలకు ఆర్థిక సాయం అందించడం కోసం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వైఎస్సార్ చేయూత. ఈ పథకం మూడో విడత పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 23న కుప్పం వేదికగా సీఎం జగన్ వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు.
అయితే వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించిన మూడో విడత నిధుల పంపిణీకి కుప్పం కేంద్రం కావడం విశేషం. ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా చంద్రబాబు నియజకవర్గంలో జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని రాజకీయ వ్యూహంగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తిన్న టీడీపీని.. ఈ కార్యక్రమంతో వైసీపీ మరింత దెబ్బకొడుతుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. జగన్ పథకం ప్రకారమే ఈ కార్యక్రమానికి వ్యూహ రచన చేసి ఉంటారనే వాదన వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఇది మైలేజ్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తంమవుతోంది.
ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా మహిళలకు రూ. 9,179.67 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. ఈ నెల 23వ తేదీన వైఎస్సార్ చేయూత మూడో విడత ఆర్థిక సాయం అందజేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రశంసించడం గమనార్హం. రాష్ట్రప్రభుత్వ వ్యయం ప్రధానంగా సామాజిక సేవల కోణంలో ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. అందులో వైఎస్సార్ చేయూతను కూడా కాగ్ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.