
Elon Musk
అనేక నాటకీయ పరిణామాల మధ్య టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. అయితే ఆయన ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఆ ప్రచారాలకు చెక్ పెడుతూ మస్క్ స్పందించారు. తాను డబ్బు కోసం ట్విట్టర్ ను కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. మానవాళి మంచి కోసమే ట్విట్టర్ ను సొంతం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రకటన దారులను ఉద్దేశిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేశారు.
భవిష్యత్ తరానికి ఉమ్మడి డిజిటల్ వేదిక ఉండడం చాలా అవసరం అన్నారు మస్క్. ఆరోగ్యకరమైన వాతావరణంలో అనేక అంశాలపై చర్చించుకునేలా ఆ డిజిటల్ వేదిక ఉండాలన్నారు. ఇప్పుడున్న సామాజిక మాధ్యమాలు విద్వేషం, విభజనను ప్రోత్సహించేలా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చించే అవకాశం కల్పించడానికి.. తాను ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను మస్క్ సొంతం చేసుకున్నారు. ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించారు. వాస్తవానికి ఆరు నెలల ముందే ట్విట్టర్ కొనుగోలు ఒప్పంద ఖరారు అయినప్పటికీ.. అప్పుడు మస్క్ పెట్టిన మెలిక వల్ల అగ్రిమెంట్ ఆగిపోయింది. కోర్టు ఆదేశాలతో మళ్లీ ఇప్పుడు కార్యరూపం దాల్చింది.