
pegasus
దేశాన్ని కుదిపేసిన పెగాసెస్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లోనూ సంచలనంగా మారింది. పెగాసెస్ ను ఉపయోగించి టీడీపీ ప్రభుత్వం డేటా చౌరీ చేసిందని వైసీపీ వాదిస్తోంది. మరి నిజంగా టీడీపీ పెగాసెస్ ను ఉపయోగించిందా? 30లక్షల ఓటర్లను రద్దు చేసే ప్రయత్నం చేసిందా? వైసీపీ ఆరోపణల్లో నిజమెంత? దానికి టీడీపీ ఏం చెబుతోంది?
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెగాసెస్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో పెగాసెస్ పై ఏర్పాటు చేసిన శాసనసభ సంఘం నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యం చేసిందని అసెంబ్లీలో కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. దీంతో ఈ వ్యవహారంపై సభ దద్దరిల్లిపోయింది. ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది.
డేటా చౌర్యంపై కరుణాకర్ రెడ్డి కమిటీ కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన సమాచారం టీడీపీ తెచ్చిన ‘సేవామిత్ర’ అనే యాప్ ద్వారా చోరీ జరిగిందనేది కరుణాకర్ రెడ్డి కమిటీ చెప్పే కీలకాంశం. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఓటర్లను రద్దు చేసే ప్రయత్నంలో భాగంగానే డేటా చోరీ జరిగిందని కమిటీ నివేకదిక చెబుతోంది. 2016 నుంచి 2019 స్టేట్ డేటా సెంటర్ లోని సమాచారాన్ని టీడీపీ వ్యక్తులకు పంపడంపై ఆరా తీసినట్లు కమిటీ తన నివేదికలో చెప్పింది. పూర్తి స్థాయి నివేదికను మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను తప్పుపడుతోంది. అందులో వాస్తవం లేదని చెబుతోంది. టీడీపీ హయాంలో డేటా చౌర్యం జగరలేదని అసెంబ్లీలో ప్రతిపక్షం గట్టిగా తన వాణిని వినిపించింది. చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ ఉపయోగించినట్లు ఎలాంటి ఆధారాలు ఉన్నాయో బయట పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సమాచారం చౌర్యం జరుగుతోందని టీడీపీ ధ్వజమెత్తుతోంది.
పెగాసెస్ విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా.. ప్రజల భద్రతకు సంబంధిన విషయంగా పరిగణించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పెగాసెస్ ను ఎవరు ఉపయోగించి.. ఎవరు డేటా చౌర్యానికి పాల్పడినా.. శిక్షించాల్సిందే. కరుణాకర్ రెడ్డి కమిటీ చెప్పిన వాటిలో ఏ ఒక్కటి నిజమైనా.. తీవ్రంగా పరిగణించాల్సిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం మరింత లోతుగా పరిశీలించి వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.