
Chandrababu in Unstoppable
అన్ స్టాపబుల్ అంటూ బావమరిదితో ఇంటర్వ్యూకు వచ్చిన చంద్రబాబు చెప్పిన వాటిలో నిజాలున్నాయా? పార్టీని, కుటుంబాన్ని ఫోకస్ చేసుకునేందుకు ఆడిన స్టేజ్ డ్రామానా? అంటే రెండోదే నిజమని అప్పటి ఘటనను ప్రత్యక్ష్యంగా రిపోర్ట్ చేసిన విలేకరులు, విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన టాక్ షోతో 1995లో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుపై జరిగిన కుట్ర అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో అందుకు వేదికైంది. ఆ షోలో బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు.. చంద్రబాబు చెప్పిన సమాధానాలు.. ఇప్పుడు తెలుగునాట రాజకీయ చర్చకు దారితీశాయి. చంద్రబాబు అధికార దాహంతో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కోలేదా? లక్ష్మీ పార్వతిని బూచీగా చూపి.. కుటుంబ సభ్యులను ఏమార్చి.. ఎన్టీఆర్ కు బాబు వెన్నుపోటు పొడిచారని ఇన్నాళ్లు జరిగిన ప్రచారంలో నిజం లేదా? ఏ కొడుకు, కూతురు తలపెట్టిన ఘోరాన్ని ఎన్టీఆర్ కు ఆయన సంతానం చేసిందనే వాదనలోవాస్తమెంత? అన్ స్టాపబుల్ షోలో ‘బాలయ్య- బావయ్య’ అన్ని నిజాలే చెప్పారా?
అవాస్తవాలను వాస్తవంగా..
ఎన్నడూ ఎంటర్టైన్మెంట్ షోలో పాల్గొని చంద్రబాబు.. ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయగా.. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులను నొప్పించే విధంగా ఉన్నాయనేది వాస్తవం. చంద్రబాబు ఎంటర్టైన్మెంట్ షో పాల్గొనడంలో తప్పు లేదు. అయితే ఆ షోను రాజకీయ వేదికగా చేసుకొని.. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని చంద్రబాబు చేయడం, బావ మాటలకు బాలయ్య వంత పాడడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి చావుకు కారణమైన వ్యక్తితో వియ్యం అందడమే తప్పు అంటే.. ఇలాంటి షోకు తీసుకొచ్చి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారని మండిపడుతున్నారు.
‘మీ జీవితంలో మీరు తీసుకున్న ‘బిగ్గెస్ట్ డెసిషన్” ఏంటని ఈ షోలో చంద్రబాబును బాలకృష్ణ అడుగుతారు. దానికి చంద్రబాబు 1995లో తీసుకున్న నిర్ణయం అని సమాధానం చెబుతారు. దీన్ని అందరూ అంగీకరించాల్సిందే. ఆ నిర్ణయం వల్లే ఎన్టీఆర్ ను గద్దె దించి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే.. తన జీవితంలో ఏనాడూ సీఎం అవుతానని చంద్రబాబు అనుకుని ఉండరు. నాడు ఆయన కుట్ర ఫలించడంతోనే ఎన్టీఆర్ కు అధికారాన్ని దూరం చేయగలిగి.. చంద్రబాబు సీఎం పీఠం ఎక్కారు.
అయితే 1995లో ఆ పని ఎందుకు చేశారో.. చంద్రబాబు ఇచ్చిన వివరణపైనే ఇప్పుడు వివాదం రాజుకుంటోంది. ఎన్నిసార్లు ఎన్టీఆర్ చెప్పినా వినలేదని.. పెద్దాయనపై నిందను మోపే ప్రయత్నం చేసి.. తన కుట్ర బుద్ధిని చంద్రబాబు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ అంత చేయకూడని పని ఏం చేశారనేది చెప్పనే లేదు. చెప్పకూడదంటూ మాట దాటవేశారు బావ బావమరుదులు. పైగా తన బావ మాటకు బామ్మర్ది బాలయ్య వంత పాడటాన్ని ఎన్టీఆర్ అభిమానులు అసలే జీర్ణించుకోలేకపోతున్నారు.
కాళ్లు పట్టుకోవడం బూటకమేనా?
పార్టీని కాపాడటానికి ఎన్టీఆర్ కాళ్లను సైతం తాను పట్టుకున్నానని.. షోలో చంద్రబాబు చాలా ఆవేదనతో చెప్పారు. అయితే ఎన్టీఆర్ కాళ్లను చంద్రబాబు పట్టుకున్నారనేది వాస్తవం. అయితే ఆ సందర్భం వేరని.. నాటి ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. పార్టీని, అధికారాన్ని లాక్కునేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను ఎన్టీఆర్ ముందే గ్రహించారట. ఈ క్రమంలో చంద్రబాబును దూరం పెట్టాలని ఎన్టీఆర్ అనుకున్నారు. ఇది తెలిసిన చంద్రబాబు.. అధికారం తనకొద్దని.. ‘మీరు చెప్పినట్లు వింటా’ అని ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని బతిమాలాడట. ఈ ఘటనను ‘అన్ స్టాపబుల్’ వేదికగా.. చంద్రబాబు తనకు అనుకూలంగా చెప్పుకునే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా దీనికి సాక్ష్యంగా వియ్యంకుడు బాలకృష్ణతో పాటు.. చనిపోయిన వారి పేర్లు చెప్పడం.. చంద్రబాబు వంకరబుద్ధికి నిదర్శనం అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రశ్నలన్నీ పక్కా ప్లానింగ్
రాజకీయ లక్ష్యంతోనే చంద్రబాబును బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు తీసుకొచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ షోలో బాలకృష్ణ అడిగిన ప్రతి ప్రశ్నకు.. చంద్రబాబు సంజాయిషీ చెప్పుకున్నట్లే కనిపించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వెన్నుపోటు విషయంలో తన తప్పేమీ లేదనే మెసేజ్ ను ప్రమోట్ చేయడానికి దీన్ని వేదికగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని.. ఇటీవల వైసీపీ తెగ ప్రచారం చేసింది. దీంతో చంద్రబాబు సెల్ఫ్ డిఫెన్స్ లోకి పడిపోయారు. ఏది మాట్లాడినా.. తనకు రివర్స్ అవుతోందని గ్రహించారు. చంద్రబాబు గ్రాఫ్ కూడా క్రమక్రమంగా పడిపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ సమయంలో తన గళాన్ని విప్పేందుకు.. తన బామ్మర్ది వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోను వేదికగా ఎంచుకున్నారు.
చెప్పులు వేసింది ఎవరు?
బాలయ్య తన షో 1995 ఘటనను గుర్తుకు తెచ్చారు కానీ.. చాలా సమాధానాలకు తన ముద్దుల బావ నుంచి రాబట్టలేకపోయారు. ఎన్టీఆర్.. తన ఆరాధ్య దైవం అని ఈ షోలో.. చంద్రబాబు చెప్పారు. మరి అంతలా ఆరాధించిన ఎన్టీఆర్ పై వైస్రాయ్ వద్ద చెప్పులు ఎందుకు వేశారు అనే ప్రశ్నను బాలయ్య అడిగి ఉంటే బాగుండేదని.. పెద్దాయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో.. చంద్రబాబు కొత్త విషయాలను ఏమీ చెప్పకపోగా.. అబద్ధాలను నిజాలుగా మార్చే ప్రయత్నం చేశారనే తెలుస్తోంది. పైగా ఏ విషయాన్ని కూలంకుషంగా చెప్పకుండా.. దాటవేసే ధోరణితోనే చెప్పినట్లు కనిపిస్తోంది. 1995లో అన్ని తాను కరెక్ట్ చేశానని, ఎన్టీఆర్ తప్పు చేశారనే మెసేజ్ ను .. ఆ షో ద్వారా పంపి.. ఇప్పటి తరాన్ని మోసం చేసే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.
నాటి ఘటనకు ప్రత్యక్ష్య సాక్షిగా ఉన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా ఈ విషయంపై స్పందించారు. చంద్రబాబు కాళ్లు పట్టుకోలేదని, ఎన్టీఆర్ కుర్చీ కింద కాళ్లు లాగేశారని మండిపడ్డారు. బాబు కుట్రకు ఏకంగా సొంత కుటుంబ సభ్యులే వంత పాడటం ఎన్టీఆర్ ను తీవ్రంగా కలచివేసిందని గుర్తు చేసుకున్నారు. ఈ టాక్ షోను చూసిన వారంతా నాటి ఘటనలో రెండో కోణం తెలియాలంటే బాలయ్య ఈసారి లక్ష్మీపార్వతిని పిలవాలని కోరుతున్నారు.