
chandrababu Naidu
వైజాగ్ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలవడాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వీరిద్దరి కలయిక ఎవరికి ప్రయోజనకరం అవుతుంది? విశాఖ గర్జన విజయవంతంతో టీడీపీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందా? తన ఉనికి కాపాడుకునేందుకే చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్ ను కలిశారా? రెండు పార్టీల మధ్య ముసుగు తొలగిపోయిందన్న వైసీపీ వాదనలో నిజమెంత?
విశాఖను రాజధాని చేయాలని జేఏసీ చేపట్టిన ‘విశాఖ గర్జన’.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు నాందిగా మారినట్లు కనిపిస్తోంది. విశాఖ గర్జన.. శాంతియుతంగా జరిగి.. విజయవంతమైన నేపథ్యంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆరోజు జనసేన కార్యకర్తలు సృష్టించిన వీరంగం.. ప్రశాంతంగా ఉన్న విశాఖలో తీవ్ర అలజడిని రేపింది. పవన్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన .. జనసేన నాయకులు మంత్రుల కార్లపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ క్రమంలో మరోసారి హింసాత్మక ఘటనలు జరగకుండా.. పోలీసులు తీసుకున్న చర్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. ఈ క్రమంలో వైజగ్ లో ఆయన వైసీపీ ప్రభుత్వంపై తన అక్కసునంతా వెళ్లగక్కారు. లేనిపోని ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని రోజులుగా మీడియాలో కూడా పవన్ కవరేజీ బాగా పెరిగింది. మూడు రాజధానుల విషయంలో వైసీపీపై పోటీ పడలేక.. టీడీపీ ఇప్పటికే సైలెంట్ అయిపోవడం.. ఇదే సమయంలో పవన్ రెచ్చిపోవడం జరిగింది.
వైసీపీ కూడా పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం.. దానికి జనసేన నాయకులు, పవన్ బదులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మీడియా కూడా చంద్రబాబును పక్కన పెట్టేసి.. పవన్ ను హైలెట్ చేయడం మొదలు పెట్టాయి. ఇలాగే స్తబ్ధుగా ఉంటే.. అసలుకే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు.. తన ఉనికిని కాపాడుకునేందుకు.. విజయవాడలో స్వయంగా పవన్ కల్యాణ్ ను కలిశారు. అయితే రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు.. పవన్ ను కలిసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
రాజకీయ ప్రయోజనాలు..
రాష్ట్రంలో వైసీపీ రోజురోజుకూ మరింత బలపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఆశ చంద్రబాబుకు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పవన్ సాయంతో మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగానే పవన్ ను చంద్రబాబు వెనకేసుకొస్తున్నారు. భవిష్యత్ లో రాజకీయంగా పవన్ ను ఉపయోగించుకునేందుకు.. చంద్రబాబు స్వయంగా పవన్ వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.