
DGP Rajendranath Reddy
కుటుంబ కలహాలతోనే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ.రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. జాతీయ నేర గణాంక సంస్థ ప్రకటించిన 2021 గణాంకాల్లో ఇదే విషయమై స్పష్టమైందన్నారు. పోలీసు శాఖ, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి ప్రారంభించారు. బెంజిసర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు విద్యార్థులతో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుల విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దని డీజీపీ సూచించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు.. అనారోగ్య సమస్యలతో మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, అధికారులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, మానసిక చికిత్స వైద్య నిపుణులు ప్రదర్శనలో పాల్గొన్నారు.