
three capitals
మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ పై మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రశంసలు కురిపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఉత్తమమైన నిర్ణయంగా అభివర్ణించారు. మూడు రాజధానులు చేయడం వెనుక జగన్ ఉద్దేశాన్ని ఆయన వివరించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు.
రియల్ ఎస్టేట్ అభివృద్ధిని రాష్ట్రాభివృద్ధిగా చూపిస్తే- వాపును చూసి బలుపుగా భావించినట్టవుతుందన్నారు. అభివృద్ధి అంతా ఒక్క రాజధాని చుట్టే ఉండాలనుకోవడం దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీసినట్లు అవుతుందన్నారు. అభివృద్ధి పేరుతో భూమి రేట్లను పెంచే ప్రయత్నం ఇదివరకు అమరావతిలో జరిగిందని గుర్తు చేశారు. భూమిని కొనడానికే అయిదు నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయ్యాల్సిన పరిస్థితి వస్తే.. చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పాలనుకునే పారిశ్రామికవేత్తలు ఇక వాటిని ఎలా నడిపిస్తారని జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు.
రాజధాని చుట్టే అన్నీ ఉండాలి.. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ ఒకే చోట కూడబెట్టుకోవాలనుకోవడం మంచిది కాదన్నారు జేపీ. అభివృద్ధి విస్తరించాలంటే.. వికేంద్రీకరణే సరైన నిర్ణయమని అన్నారు. అధికార వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు.