
AP Assembly
అసెంబ్లీలో మూడు రాజధానులు, అమరావతిలో భూస్కామ్ అంశాలపై కాసేపు చర్చ జరిగింది. మూడు రాజధానుల ఆవశ్యకతపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సభలో మాట్లాడారు. ఏ ఒక్కరి కోసం వికేంద్రికరణ కాదన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలనే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు.
సీఎం జగన్ పై పనిగట్టుకొని ఆరోపణల చేయడం టీడీపీ అలవాటైపోయిందన్నారు. చంద్రబాబు బినామీలు దళితులను భయపెట్టి అసైన్డ్ భూములను లాక్కున్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకెళ్లి అడ్డుకున్నది టీడీపీ కాదా అని ప్రశ్నించారు కొడాలి నాని. అమరావతిని చంద్రబాబు రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారన్నారు.
వారి చేతుల్లో 10వేల ఎకరాలు : బుగ్గన
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. కొంతమంది చేతుల్లోనే పదివేల ఎకరాల అమరావతి భూములు ఉన్నాయన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పూర్తిగా పక్కపెట్టేశారన్నారు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. హెరిటేజ్ ఫుడ్స్ కూడా 14ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అప్పటి ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అన్నారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో భూముల కొనుగోలు జరిగిందన్నారు. రియల్ ఎస్టేట్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పాదయాత్రలో స్థానికులు లేరని, రియల్ ఎస్టేట్ బ్యాచ్ చేస్తున్న పాదయాత్ర ఇదని ధ్వజమెత్తారు.