
ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ చనిపోయారు. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సూర్యనది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొనగా.. ఆయన అక్కడికక్కడే చనిపోయారు.
మిస్త్రీ నేపథ్యం..
సైరస్ మిస్త్రీది మొదటి నుంచి వ్యాపారల కుటుంబమే. 1968 జులై 4వ తేదీన ముంబయిలో జన్మించారు మిస్త్రీ. ప్రముఖ వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ, పాట్సీ పెరిన్ దుబాష్ ఆయన తల్లిదండ్రులు. 157ఏళ్ల చరిత్ర కలిగిన మల్టీ బిలియన్ డాలర్ల సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడు మిస్త్రీ. షాపూర్జీ పల్లోంజీ ఈ ఏడాది జూన్ 28న మరణించారు. సైరస్ మిస్త్రీ ముంబయిలోని ప్రముఖ క్యాథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో ప్రాథమిక విద్యభ్యసించారు. యూనివర్శిటీ ఆఫ్ లండన్ నుంచి 1990లో సివిల్ ఇంజినీరింగ్ బీఈ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్లో చదివారు.
1930లో మిస్త్రీ తాత షాపూర్జీ మిస్త్రీ టాటా సన్స్‌లో తొలిసారి వాటాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ వాటా 18.5 శాతానికి చేరింది. వాస్తవానికి 1865లో సైరస్ మిస్త్రీ ముత్తాత పల్లోంజి మిస్త్రీ..లిటిల్‌వుడ్ పల్లోంజీ అండ్ కో సంస్థను ఏర్పాటు చేశారు. కాలగమనంలో లిటిల్‌వుడ్ పల్లోంజీ అండ్ కో సంస్థ.. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌గా రూపాంతరం చెందింది.
అయితే 2016లో టాటా గ్రూప్.. సైరస్ మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగించింది. ఆ నిర్ణయంతో భారత దేశ చరిత్రలో ఈ రెండు కార్పొరేట్ దిగ్గజ సంస్థల మధ్య వైరం మొదలైంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు.. టాటా గ్రూప్‌లో 18.6శాతం వాటాలున్నాయి. 2022లో షాపూర్జీ గ్రూప్ దాదాపు 30 బిలియన్ల నికర విలువను కలిగి ఉంది. 50 కంటే ఎక్కువ దేశాలలో 50వేల మందికి పైగా ఉద్యోగులు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో పనిచేస్తున్నారు.