
సీపీఎస్, జీపీఎస్ వద్దంటున్న ఉద్యోగులు | సీఎం నివాసం ముట్టడికి సిద్ధం
ఆర్థిక భారం కారణంగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయలేమని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. మధ్యే మార్గంగా జీపీఎస్‌ను అమలు చేస్తామని తెలిపింది. అయితే ఉద్యోగులు మాత్రం సీపీఎస్, జీపీఎస్లేం వద్దని తేల్చి చెబుతున్నారు. ఓపీఎస్‌ను అమలు చేసే వరకు తగ్గేదేలే అంటున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. ఆ వెంటనే చర్చలకు పిలిచిన ప్రభుత్వం మరోసారి కూర్చుందామని సూచించింది. అయితే చర్చలు చర్చలే, ముట్టడి ముట్టడేనని సీపీఎస్ సంఘాల నేతలు, ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. అలాగే విజయవాడలో మిలియన్ మార్చ్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక, జీఏడీ శాఖల ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు 5 గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. సమావేశానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరు కాలేదు. కనుక ఆయనతో మాట్లాడాక, మరోసారి చర్చలకు పిలుస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రి బొత్స, సజ్జల తెలిపారు. అయితే జీపీఎస్ అంశంపైనే చర్చించేందుకైతే తాము రాబోమని ఉద్యోగ సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఓపీఎస్‌ను అమల్లోకి తెస్తామని విస్పష్టమైన ప్రకటన చేస్తేనే చర్చలకు వస్తామని తెగేసి చెప్పారు. మొత్తంగా సీపీఎస్ అంశంపై మూడేళ్లుగా ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ప్రతిష్టంభన వీడటం లేదు.