
vijaya sai reddy
చంద్రబాబు, టీడీపీకి చెందిన ఎల్లో మీడియా పనిగట్టుకుని విశాఖ భూములపై.. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. వైసీపీ ప్రభుత్వంపైనా, తనపైనా తప్పుడు ఆరోపణలతో, విషపురాతలు రాస్తున్నారని మండిపడ్డారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయన్నారు. ఒకటి.. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని రాకుండా చేయాలన్నదే చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా లక్ష్యం అన్నారు. గుంటూరుకు – విజయవాడకు మధ్యన కాకుండా, ఆ రెండు నగరాలకు 30 కిలోమీటర్ల దూరంలో.. దానికి అమరావతి అని పేరు పెట్టి, కొన్నివందల, వేల ఎకరాలు టీడీపీ నాయకులు, వారి బినామీలు, వారికి వత్తాసు పలికే మీడియా మిత్రులంతా కలిసి రైతుల దగ్గర చౌకగా కొనుగోలు చేసి, ఆ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేసి, తద్వారా లక్షల కోట్లు గడించాలనే దురుద్దేశంతో విశాఖకు రాజధాని రాకుండా వీళ్ళంతా ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కార్యక్రమం చేస్తున్నారు.
కుల, పచ్చ ఇంకుతో..
సాధారణంగా మీడియా ప్రతినిధులు తమ ఆర్టికల్స్‌ను, వార్తలను ఇంక్‌తో రాస్తారని, కానీ రాష్ట్రంలోని కొన్ని పత్రికలు కులాన్ని ఇంక్ గా ఉపయోగించుకుని, అది కూడా పచ్చ ఇంక్‌ను ఉపయోగించుకోవడం విశేషమన్నారు. ముఖ్యంగా రామోజీరావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి. రామోజీరావును ‘రాము’ అని సంభోదిద్దామంటూ.. విరుచుకుపడ్డారు. టీడీపీ కుల పత్రికలు, టీవీ చానల్స్ దిగజారుడుతనాన్ని ప్రదర్శించడం శోచనీయమన్నారు. రామోజీరావుకు నైతిక విలువలు లేవు అన్నారు.
సుప్రీం తీర్పును అమలు చేస్తే తప్పేంటి?
దసపల్లా భూముల విషయంలో.. భూముల యజమానులు, బిల్డర్లు ఇప్పటికే వివరణ ఇచ్చారన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. గతంలో ఈ భూములపై కోర్టులో చాలా కేసులు ఉన్నాయని, అధికారులు అందరి మీద కంటెంప్ట్ వేయడం జరిగిందన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు కూడా ఇప్పటికీ ఈ కేసులకు సంబంధించి కూడా ప్రతివారం కోర్టులకు హాజరు అవుతున్నట్లు గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దసపల్లా భూములు రాణి కమలాదేవికి చెందినవని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పును ఇచ్చినట్లు పేర్కొన్నారు.
” నా కూతుర్ని అరబిందో సంస్థల యజమాని కొడుక్కి ఇచ్చి వివాహం చేశా. వాళ్ల ఇంటికి వెళ్లాక ఆమె ఇంటి పేరు కూడా మారింది. ఆమె పేరు ఇప్పుడు వేణుంబాక నేహ కాదు. (పెనక నేహారెడ్డి). వాళ్ల కుటుంబంలో సభ్యురాలు ఆమె. వాళ్లు గత 40ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉన్నారు. వాళ్ళు, రామోజీలా భాగస్వామ్యులను మోసం చేసి ఆస్తులు సంపాదించలేదు. మా వియ్యంకుడి కుటుంబం నిజాయితీగా ఫార్మా ఇండస్ట్రీస్, ఎస్ఈజెడ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారు. అనేక వ్యాపార రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.”
-వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
‘నా కూతురిని వాళ్లింటికి కోడలుగా పంపిస్తే… వాళ్ల ఆస్తులు నావి అయిపోతాయా?. ఈమాత్రం రామోజీకి కనీస జ్ఞానం కూడా లేదా? అందుకే రామోజీ అన్నం తింటున్నాడా?.. అని సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ల పేరుతో ఈ భూములు నేనేదో కొన్నట్టుగా, నా మీద, వైసీపీపైనా బురదచల్లే కార్యక్రమం రామోజీ చేస్తున్నారు’ అన్నారు విజయసాయిరెడ్డి.