
వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి చమురు విక్రయ సంస్థలు. సెప్టెంబరు నెల తొలిరోజే భారీగా ధరను తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకున్నాయి. చమురు విక్రయ సంస్థలు తీసుకున్న తాజా నిర్ణయంతో దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ బండ ధర ధర రూ.91.50 తగ్గి రూ.1,885కు చేరింది.
ఇటీవల కాలంలో వాణిజ్య సిలిండర్ ధరల్ని తగ్గించడం ఇది వరుసగా ఐదోసారి. చివరిసారి ఆగస్టు 1న సిలిండర్‌పై రూ.36 తగ్గించాయి చమురు సంస్థలు. గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పాయి.
తాజాగా పెరిగిన ధరలు ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి. కోల్‌కతాలో రూ.100 తగ్గి రూ.2,095.50 నుంచి రూ.1995.50కు చేరింది. చెన్నైలో రూ.96 తగ్గి రూ.2,045కు.. ముంబయిలో రూ.92 తగ్గి రూ.1,844, హైదరాబాద్‌లో రూ.100 తగ్గి రూ.2,097.50కు చేరింది. పెరిగిన ధరలు సెపెంబర్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు తెలిపాయి.