
cm jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా నిలిచింది. 94.47శాతం లక్ష్యానికి చేరగా.. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలోనే జీఎస్టీ సగటు వసూళ్లు అధిక సంఖ్యలో నమోదయ్యాయి.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పారదర్శక, సులభతర విధానాలద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలని కోరారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.
నాటుసారా తయారీయే వృత్తిగా జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అనుమతులు పొందిన లీజుదారులు మాత్రమే మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. వారికేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రవాణా శాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో సాధించిన ఆదాయాల ప్రగతిని అధికారులు వివరించారు. జీఎస్టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నామని తెలిపారు. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల ఆదాయాలు గాడిలో ఉన్నాయని అధికారులు వివరించారు.
94.47శాతం లక్ష్యం చేరుకున్నామని సెప్టెంబరు 2022 వరకూ లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ. 25,928 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ కాలంలో దేశ జీఎస్టీ వసూళ్ల సగటు 27.8 శాతం కాగా, ఏపీలో 28.79శాతంగా ఉందని అధికారులు తెలిపారు.
గ్రామాల్లో మహిళా పోలీసులనుంచి తప్పనిసరిగా ప్రతిరోజూ నివేదికలు తీసుకోవాలి. బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలి. ఈ నివేదికలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీలో ఐఏఎస్అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్‌లను సభ్యులుగా పెట్టాలన్నారు. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన సేవలు ఏంటి? వాటివల్ల ఎలాంటి హక్కులు దాఖలు పడతాయి? అది ప్రజలకు ఎలా ఉపయోగమనే దానిపై అవగాహన కల్పించాలని సీఎం తెలిపారు.
అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు. నాన్ రిజిస్ట్రేషన్ పరిస్థితులను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఇందులో ప్రొఫెషనల్ ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలన్నారు.
గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు వరకూ రూ.1,174 కోట్ల ఆదాయం కాగా, ఈ ఏడాదికి మొత్తంగా 19 శాతం పెరిగి.. సెప్టెంబరు వరకూ రూ.1400 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తం ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 43శాతం పెరుగుదల ఉంటుందని అధికారులు అంచనాగా తెలిపారు.
ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ ) కె నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీపర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, కమర్షియల్ టాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.